ALLEGATIONS ON SATTENAPALLI SI : కుటుంబ గొడవ నేపథ్యంలో ఫిర్యాదు తీసుకోలేదని ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేసిన పట్టణంలోని సుగాలీకాలనీకి చెందిన ఆర్. బాలాజీనాయక్‌ను ఎస్సై, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టి గాయపరిచారంటూ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ వివరాల ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని సుగాలీకాలనీకి చెందిన బాలాజీనాయక్.. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో అతడి తమ్ముడు కోటేశ్వరరావునాయక్ మధ్య శనివారం గొడవ జరిగింది. తన బావ బాలాజీ నాయక్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి గడ్డ పలుగుతో తలుపులు పగులగొట్టి తమపై దాడి చేయబోయారని బాలాజీ సోదరుడి భార్య ఆర్. దుర్గాబాయి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనాయక్న్ను ఆదివారం ఉదయం స్టేషనకు పిలిపించారు.
ఈ క్రమంలో బాధితుడు తన పైనా దాడి చేశారని ఫిర్యాదు తీసుకోవాలని ఎస్సై ఎ.రఘుపతిరావుని బాలాజీ కోరాడు. ఎస్సై సరిగ్గా స్పందించలేదని అతడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చెయ్యడమే కాకుండా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించాడు. తాను మాట్లాడుతుంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తావా అంటూ స్టేషన్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ తనను ఇష్టారాజ్యంగా కొట్టారని బాలాజీ నాయక్ ఆరోపించాడు. ఊపిరి ఆడట్లేదని చెప్పినా వినిపించుకోలేదని, ఫోన్ లాక్కొని కొట్టారని ప్రభుత్వ ఆసుపత్రిలో అతడు విలేకర్లకు తెలిపాడు.
తన చరవాణి పోలీసుల వద్దే ఉందని చెప్పాడు. అయితే ఆ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఎస్సై మాట్లాడుతూ.. బాలాజీనాయక్‌పై అతడి మరదలు ఫిర్యాదు చేస్తే విచారించేందుకు పిలిపించాము తప్ప అతనిపై చెయ్యి చేసుకోలేదన్నారు. స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని తాము దాడి చేస్తే అందులో అవి రికార్డు అవుతాయని ఆయన తెలిపారు. పోలీసులపై ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నాడన్నారు. గడ్డ పలుగుతో తమ్ముడి ఇంటి తలుపులు పగలగొడుతున్న సమయంలో బాలాజీ నాయక్ చేతికి గాయాలయ్యాయని ఎస్సై చెప్పారు. మరో వైపు బాలాజీ నాయక్ మధ్యాహ్నానికి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే జరిగిన ఘటనపై ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని తెలిసింది.
మద్యం మత్తులో చెప్పా: తనని ఎస్సై, కానిస్టేబుల్ కలిసి కొట్టారంటూ హల్చల్ చేసిన బాలాజీ నాయక్ ఉదయం అయ్యే సరికి ప్లేట్ ఫిరాయించాడు. మద్యం మత్తులో ఎస్సై కొట్టారని చెప్పా.. అదంతా అబద్ధం అన్నాడు. ఎస్సై తనని కొట్టలేదని ఆదివారం రాత్రి విలేకర్లకు చెప్పడం బాలాజీనాయక్ చెప్పడం గమనార్హం..
ఇవీ చదవండి: