YSRCP Leaders Removing TDP Sympathizer Votes : మనవాళ్ల ఓట్లయితే చేర్చు.. ప్రతిపక్షం వాళ్లయితే తొలగించు.. ఇదీ పల్నాడు జిల్లాలోని కృష్ణా తీర ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన ఓ గ్రామస్థాయి నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణ. కులాల వారీగా ఓట్ల వివరాలు అడిగి.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ సాగిన ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్‌గా మారింది. ఫోన్ సంభాషణలో ఉన్నది పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావేనని ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sreedhar) ఓటమి భయంతోనే తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.
Irregularities in AP Voter List 2023 : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్.. పెద్దసంఖ్యలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఒక సామాజికవర్గానికి చెందినవారి ఓట్లు తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేయించిన ఆయన.. వాటి పురోగతిని వాట్సప్ ద్వారా పర్యవేక్షిస్తూ దొరికిపోయారు.
Fake votes in Andhra Pradesh : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికారపార్టీ నాయకులు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను వేల సంఖ్యలో తొలగించే కుట్రల్ని రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలకు అంతేలేదు. ఆయన ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు బూత్‌స్థాయి అధికారులు, పోలీసులు అధికారులు ఇప్పటికే సస్పెండయ్యారు.
పట్టనట్లు వ్యవహరిస్తున్న కలెక్టర్లు : మంత్రి సీదిరి అప్పలరాజు కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్తల సమావేశంలో మన ఓట్లయితే సరే, మనవి కాదనుకుంటే వాటిపై అభ్యంతరం చెప్పండి. ఫారం-7 దాఖలు చేయండని సూచించారు. మనవైన ఓట్లు ఉంచాలి. కాదంటే తీసేయించాలని కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. అధికారపార్టీ నాయకులు ఈ స్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ నేత ఇంట్లో బీఎల్‌ఓలతో సమావేశం : ఉరవకొండలో 6 వేలకుపైగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేశవ్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో ఆయన కుమారుడు బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించి, మరిన్ని ఓట్లు తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని కేశవ్ మరో ఫిర్యాదు చేసినా కలెక్టర్ తూతూ మంత్రంగా దర్యాప్తు చేయించి, అలాంటిదేమీ లేదని తేల్చేశారు. కేశవ్ దిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేసి, వెంటపడటంతో నియోజకవర్గ ఈఆర్‌ఓలుగా పనిచేసిన ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారు.
Illegal Votes in AP : పర్చూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు జరిగిన కుట్రను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు హైకోర్టులో పోరాడితే తప్ప ఎన్నికల సంఘంలో స్పందన రాలేదు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో 40 వేలకుపైగా ఓట్లు తీసేశారని, వాటిలో అత్యధికం ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులవేనని అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే కేవలం 22 మంది ఓట్లే తొలగించారని తేల్చేసిన అధికారులు, ముగ్గురు బీఎల్‌ఓలపై చర్యలు తీసుకుని సరిపెట్టేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెనాలి శ్రావణ్‌కుమార్ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
ఉంగుటూరులో అధికార పార్టీ అరాచకం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు యత్నం
ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘం : 2019 ఎన్నికలకు ముందు పెద్ద స్థాయిలో ఫారం-7 దరఖాస్తులను దాఖలు చేసిన వైసీపీ.. అప్పటి అధికార పక్షానికి చెందిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. అప్పట్లో ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ ఏర్పాటు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులన్నీ తొక్కిపెట్టేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతే లేకుండా చెలరేగిపోతోంది. అయితే అధికార పార్టీ కుట్రకు ఉద్యోగులు, పోలీసులు.. బలైపోతున్నారు. దరఖాస్తులు దాఖలు చేయించిన వైసీపీ నేతలపై మాత్రం.. జిల్లాల కలెక్టర్లు గానీ, ఎన్నికల సంఘం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
సామాజిక మాద్యమాల్లో వైరల్ అయిన గ్రామస్థాయి వైసీపీ నేతకు, ఆ పార్టీ ఎమ్మెల్యే సంభాషణ
గ్రామస్థాయి వైసీపీ నేత : 460 ఉన్నాయి సర్.
ఎమ్మెల్యే : అన్ని లేవే
వైసీపీ నేత : పొరుగూరిలో ఉన్నవారితో కలిపి అన్ని ఉంటాయ్ సర్...
ఎమ్మెల్యే : ఇక్కడ జాబితాలో 375 ఉన్నాయి, అందులో మనకు ఎన్ని ఉంటాయి?
వైసీపీ నేత : మనకు 250 పక్కా పడతాయి సర్.
ఎమ్మెల్యే : మాల ఓట్లు పరిస్థితి ఏంటి... 229 ఉన్నాయి.
వైసీపీ నేత : మనకే ఎక్కువగా ఉంటాయి. 150 వరకు మనకే ఉంటాయి.
ఎమ్మెల్యే : బోయవాళ్లు....
వైసీపీ నేత : 170 నుంచి 180 ఉంటాయి.
ఎమ్మెల్యే : బోయలవి 150 ఉన్నాయి. మొత్తం మీ ఊళ్లో ఉన్నవి 1000 ఓట్లే కదా?
వైసీపీ నేత : బోయలవి చెరో సగం ఉంటాయి సర్.
ఎమ్మెల్యే : మాదిగ 73 ఉన్నాయి.
వైసీపీ నేత : మనకు 30 ఉంటాయి సర్. ఎక్కువ తెదేపాకు ఉంటాయి.
ఎమ్మెల్యే : కాపుల ఓట్లు..?
వైసీపీ నేత : ఇద్దరికీ చెరి సగం ఉన్నారు. రేపు ఎటు వేస్తారో తెలియదు.
ఎమ్మెల్యే : అవును కాపుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఊరిలో.. వాళ్లు ఊరిలో ఉండటం లేదంటగా.. పొరుగూరిలో ఉంటున్నారంటగా..
వైసీపీ నేత : అవును సర్.. వాళ్లు చాలామంది బయటే ఉంటున్నారు. ఊరిలో రెండు కుటుంబాలే ఉంటున్నాయి.
ఎమ్మెల్యే : తీసేయాలి కదా వాళ్లవి.. తీసివేతలకు పెట్టలేదా?
వైసీపీ నేత : పోయినసారి తీసివేతలకు పెట్టాము సర్. గొడవ జరిగి కొంతమంది ఉంచండి, కొందరు తీసేయాలని అంటున్నారు.
ఎమ్మెల్యే : కాపుల ఓట్లు తీసేయండి. తీసేయాలని పెట్టి నోటీసులు ఇవ్వాలని తహసీల్దారుకు చెప్పండి. ఇవాళే వెళ్లు.. తహసీల్దారు దగ్గరకు వెళ్లి గట్టిగా మాట్లాడండి.
వైసీపీ నేత : సరే సర్.. ఈ రోజు ఆదివారం రేపు వెళతాను.
ఎమ్మెల్యే : నోటీసులు ఇవ్వండి, వస్తే ఉంచండి లేకపోతే తీసేయాలని చెప్పండి. కాపులవి ఎన్ని ఉంటాయి.
వైసీపీ నేత : 70లోపు ఉంటాయి. చెరో సగం ఉంటాయి సార్. కాకపోతే రేపు పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.
ఇలా మిగతా కులాలకు సంబంధించిన ఓట్ల వివరాల్ని కూడా ఆరా తీశాక..
ఎమ్మెల్యే : ఇప్పుడు ఊరిలో లేని అవతలి వాళ్లవి మొత్తం తీసివేయడానికి పెట్టేసేయండి.. మనవి పొరుగూరిలో ఉన్నా వారి ఓట్లు వెంటనే చేర్చండి, వెంటనే ఆ పని చేయండి.
వైసీపీ నేత : సరే సర్.
మితిమీరుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - వైసీపీ సానుభూతిపరులకు రెండేసి ఓట్లు