Industrial hub: ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం భారీగా భూములను కేటాయిస్తోంది. నెల్లూరు జిల్లా రాపూరు, చేపూరు గ్రామాల్లోని 4 వేల 827.04 ఎకరాలను ప్రభుత్వం ఇస్తోంది. ఇది సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విశ్వేశ్వరరెడ్డికి చెందిన సంస్థ. పారిశ్రామిక హబ్‌లో సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని అధికారులు వెల్లడించారు. కేవలం కలెక్టర్ లేఖ ఆధారంగా.. వేలాది ఎకరాలను సేకరిస్తున్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రకటన ఇస్తున్నట్లు.. జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత విభాగాధిపతులకు లేఖను.. 2022 నవంబర్ 7న జారీచేశారు. దీని ఆధారంగా సోమవారం.. భూముల కేటాయింపుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 పునరావాస చట్టం ప్రకారం వర్తించే కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. పునరావాస చట్టంలోని చాప్టర్ 2, 3 ప్రకారం... పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రజాప్రయోజనాలు, సామాజికంగా చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని... అవసరాల మేరకే భూములు సేకరరిస్తున్నట్లు గెజిట్‌లో ప్రస్తావించింది. సమీపంలో ఉన్న రామాయపట్నం పోర్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే భూముల సేకరణకు సంబంధించి.. రెవెన్యూశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై రైతుల నుంచి సుముఖత వ్యక్తం కావడం లేదు. ఇవేమీ లెక్కచేయకుండా... అధికారులు భూములను సేకరిస్తున్నారు.
ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్నదేం కాదు. ఆ సంస్థను 2022 ఫిబ్రవరి 3న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ చేశారు. 6-3-8-879/B, మూడో అంతస్తు, గ్రీన్‌లాండ్స్, జి.పుల్లారెడ్డి స్వీట్స్ బిల్డింగ్స్, బేగంపేట, హైదరాబాద్ అడ్రస్‌లో సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థలో కటారు రవికుమార్‌రెడ్డి, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, కొల్లా శరత్‌చంద్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆర్ఓసీకి పత్రాలు సమర్పించారు. సంస్థ ఆథరైజ్డ్ మూలధనం 10 లక్షల రూపాయలు. పెయిడప్ క్యాపిటల్ లక్ష రూపాయలు మాత్రమే. ఇప్పటివరకు ఈ సంస్థ ఎలాంటి ప్రాజెక్టులనూ నిర్వహించింది లేదు. ఇలాంటి సంస్థకు... రాష్ట్రంలో 7 వేల 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ప్రభుత్వం ఇప్పటికే కట్టబెట్టింది. 2022 సెప్టెంబరు 5న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి- ఎస్ఐపీబీ సమావేశంలో వైఎస్సార్ జిల్లా పైడిపాలెం దగ్గర పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టు, సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 33 వేల 33 కోట్ల రూపాయలను సంస్థ ఖర్చు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి