Welfare Hostel Students Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పరిపాలనలో సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా తయారయ్యాయి. ఏ వసతి గృహాన్ని సందర్శించినా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న కష్టాలు, అవస్థలు మాటల్లో చెప్పలేని స్థితికి చేరాయి. సంక్షేమ వసతి గృహాల్లో కిటికీలుంటాయి కానీ వాటికి తలుపులుండవు!. లైట్లుంటాయి కానీ అవి వెలగవు! ఫ్యాన్లు ఉంటాయి కానీ తిరగవు.! నీటి కొళాయిలుంటాయి కానీ పైపులుండవు. పైకప్పులు పెచ్చులూడుతున్నాయి!, పరిసరాలు కంపుకొడుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల పరిస్థితులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై ఈటీవీ భారత్ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీద విద్యార్థులపై సీఎం జగన్ ప్రగల్భాలు: రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద పిల్లలపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తారు. తమ పరిపాలనలో బీద పిల్లలకు ఇది చేశాం, అది చేశాం అని బీరాలు పలుకుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్ చెప్పినా మాటలకి, అక్కడి పరిస్థితులకు ఎటువంటి సంబంధం ఉండదు. అందుకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలే. రాష్ట్రంలోని పిల్లలకు మేనమామనంటూ వరసలు కలిపేసుకున్న సీఎం జగన్, బీద విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు.
అంధుల పాఠశాలలో అలజడి- రాజమహేంద్రవరంలో దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల కూల్చివేత
అక్కడే పాఠం-అక్కడే పడక: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు నమ్మి, ఎవరైనా రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల వైపు చూశారో ఇక అంతే. హాస్టళ్లలో పిల్లల పడుతున్న కష్టాలను చూసి తల్లిదండ్రుల కచ్చితంగా కన్నీరు కార్చాల్సిందే. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు కటిక నేలపై పడుకుంటున్నారు. కంటి నిండా నిద్రలేక అవస్థలు పడుతున్నారు. చలికి గజగజ వణుకుతున్నారు. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంక్షేమ వసతి గృహాల్ని బాగు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
టెక్కలిలో టూ ఇన్‌వన్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని గిరిజన, సంక్షేమ వసతి గృహంలో 150 మంది విద్యార్థులు గదులు చాలక టూ ఇన్‌వన్‌గా వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం అదే గదిలో పాఠం వినడం, రాత్రికి వాటిని పక్కకు జరిపి అక్కడే పడుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రూ.8 కోట్ల 75 లక్షలతో అదనపు తరగతి గదులు, డార్మెటరీ, ఓవర్ హెడ్ ట్యాంకు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ఎన్నికల నాటికే రూ.3 కోట్ల 57 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైసీపీ సర్కార్, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నాలుగున్నరేళ్లుగా పిల్లలు ఇలా అవస్థలు పడుతున్నా జగన్ సర్కార్ మాత్రం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.
తలుపుల్లేవ్-తంటాలు తప్ప!: ఏలూరు ఎస్సీ వసతి గృహంలో తలుపులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హాస్టల్‌లో పేరుకు 20 మరుగుదొడ్లుంటే ఒక్కటంటే ఒక్కదానికీ కూడా తలుపులు లేవని విద్యార్థులు వాపోయారు. అత్యవసర పరిస్థితులో ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నామని ఆవేదన చెందారు. గచ్చు, కొళాయిలు ఊడిపోయాయి, ఎటుచూసినా అపరిశుభ్రం తప్ప చెప్పుకోవడానికి ఏమీలేదు జగన్ మామా అని విద్యార్థులు ఆగ్రహించారు.
శిథిలావస్థలో వసతి గృహం-ఆందోళనలో విద్యార్థులు: మన్యం, ఉమ్మడి విశాఖ, పాడేరులోని సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ''మా వసతి గృహాల్లో గదుల నుంచి బాత్రూమ్ వరకూ అంతా బహిరంగంగా ఉంది. ఒక్కటంటే ఒక్కదానికీ తలుపుల్లేవ్. చలికి తాళలేక దుప్పట్లు అడ్డుగాపెట్టుకుంటున్నాం. పాడేరులోని గిరిజన ఆశ్రమ పాఠశాల పేరుగొప్ప ఊరుదిబ్బలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో సోలార్ హీటర్లుండేవి. అవి మరమ్మతులకు గురైనా బాగు చేయించలేదు. చన్నీళ్ల స్నానం చేయలేక కాళ్లు, చేతులు కడుక్కుంటున్నాం. భోజనం పేరుకే పెడుతున్నారు. కూర తినలేక పచ్చడి ప్యాకెట్లు బయట కొనుక్కుని కడుపునింపుకుంటున్నాం.'' అని అన్నారు.
ఆరుబయటే స్నానాలు: కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మరుగుదొడ్లు వాడితే కాదు, వాటివైపు చూసినా రోగాలు వ్యాపిస్తాయేమో అనేంత భయంకరంగా తయారయ్యాయి. సరైనా వసతులు, గదులు లేక విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేసేస్తున్నారు. 90 మంది విద్యార్థులుంటే ఐదేసి మరుగుదొడ్లు ఉన్నాయని, వాటికి తలుపులు లేక చాలా దుర్వాసగా ఉందని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా, నిద్రించేందుకు మంచాలూ లేక, దుప్పట్లు చాలక చలి, దోమలతో సతమతమవుతున్నామని ఆవేదన చెందారు.
అర్థరాత్రైనా, అపరాత్రైనా రైల్వేట్రాక్ వైపుకే: నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల గోడలు బీటలుబారాయి. వర్షం కురిస్తే అందులోకి నీరు దిగుతుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కిటికీలకు తలుపుల్లేక చెక్కముక్కలు అడ్డంపెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు. కొండాయిపాలెంలో హాస్టల్ పెచ్చులు ఊడి ఎక్కడ పడతాయోనని విద్యార్ధులు భయపడుతున్నారు. బొమ్మలసత్రంలో రెండు ఎస్సీ వసతి గృహాల్లో 228 మంది విద్యార్థులు ఉంటున్నారు. అందరికీ కలిపి 10 స్నానాలగదులే ఉండడంతో మురుగునీరు, వ్యర్థాలు చేరి అవీ అధ్వానంగా తయారయ్యాయి. మూత్రశాలల్లోని సింకులు పగిలిపోవడంతో విద్యార్థులు కాలకృత్యాల కోసం అర్థరాత్రైనా, అపరాత్రైనా పక్కనున్న రైల్వేట్రాక్ వైపునకు వెళ్తున్నారు.