Ward Sachivalayam Construction problems in Vijayawada: విజయవాడలోని అనేక కాలనీల్లో స్థానికులు.. వార్తాపత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి నిర్మించిన రీడింగ్ రూములను..జగన్(Jagan) సర్కార్ వార్డు సచివాలయాలుగా మార్చేసింది. ఏడాదిలోపు రీడింగ్ రూములు ఖాళీ చేసి.. ప్రత్యమ్నాయం చూసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు . నాలుగేళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు.
అమలు కాని అధికారులు హామీ: ప్రభుత్వ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయాలు... బెజవాడలోని అనేక కాలనీల వాసులకు ఇబ్బందికరంగా మారాయి. కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత పాలకులు రీడింగ్ రూములను ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ఆ రీడింగ్ రూములను వార్డు సచివాలయాలు (Secretariats)గా మార్చింది. ఏడాదిలోగా రీడింగ్ రూములు ఖాళీ చేసి.. ప్రత్యమ్నాయం చూసుకుంటామని అధికారులు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సచివాలయాలపైనే మరో అంతస్తు నిర్మించి వాటిని రీడింగ్ రూమ్‌లు Reading rooms)గా రూపొందిస్తామని వాగ్దానం చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఆ దిశగా నగరపాలక అధికారులుగానీ, వైసీపీ ప్రజాప్రతినిధులుగానీ దృష్టి సారించలేదు. దీంతో అధికార నేతల తీరుపై విపక్షాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు డిమాండ్: గతంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన రీడింగ్ రూములను కాలనీవాసులు, వృద్ధులు.... వార్తా పత్రికలు, పుస్తకాలు చదువుకోవటానికి వినియోగించుకునేవారు. సమావేశాలు, చిన్నపాటి వేడుకలకు సైతం వీటినే ఉపయోగించుకునేవారు. వైసీపీ (YCP) ప్రభుత్వ నిర్వాకంతో... కాలనీవాసులు సమావేశం అయ్యేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. రీడింగ్ రూములను సచివాలయానికి తీసుకున్న సమయంలో... మరణించిన ప్రముఖ కాలనీవాసుల చిత్రపటాలను అధికారులు తీసేశారు. దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సీటీఓ(CTO) కాలనీ, భారతీనగర్, ఎల్ఐసీ కాలనీ (LIC Colony) ప్రాంతాల్లో రీడింగ్ రూములను తిరిగి ఏర్పాటు చేయాలని నగరపాలక అధికారులు, ప్రజాప్రతినిధుల్ని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సచ్చివాలయాలను రీడింగ్ రూములుగా ఉపయోగిస్తామని హెచ్చరిస్తున్నారు.
'తామంతా సాయంత్రం, ఉదయం సమయాల్లో రీడింగ్ రూములకు వచ్చిన వార్తా పత్రికలు, వివిధ రకాల పుస్తకాలు చదువుకునే వాళ్లం. సచ్చివాలయం ఏర్పాటుతో ప్రస్తుతం తమకు ఆ అవకాశం లేకుండా పోయింది. కాలనీకి చెందిన మరణించిన ప్రముఖుల ఫొటోలు భద్రపరిచామని సచివాలయాలుగా మార్చిన తరువాత ఆ ఫొటోలను తొలగించారు. రీడింగ్ రూములుగా ఉన్న సమయంలో కాలనీకి సంబంధించిన సమావేశాలు, చిన్నపాటి వేడుకలు ఇక్కడే నిర్వహించుకునే వాళ్లం. ప్రస్తుతం స్థానికంగా చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.' -స్థానికులు