Drinking Water, Drainage Problem In Viyawada Autonagar: విజయవాడ ఆటోనగర్‌లో తాగునీటి సమస్య కార్మికులను తీవ్రంగా వేధిస్తోంది. నిత్యం వేలాది మంది కార్మికులు వాహనాల మరమ్మతుల నిమిత్తం ఆటోనగర్‌కి వస్తుంటారు. వీరంతా దాహాన్ని తీర్చుకునేందుకు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. మురుగు నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో రోడ్లపై బురద, చెత్త పేరుకుపోయింది. దీంతో అనారోగ్యానికి గురువుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది విజయవాడలోని ఆటోనగర్ పరిస్థితి. ఇక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అన్ని కలిపి సుమారు 3వేల వరకు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే పేరొందిన ఈ పారిశ్రామిక వాడ.. నేడు మౌలిక వసతుల లేమితో అధ్వానంగా తయారైంది. పారిశ్రామిక వాడ ఏర్పడి 56ఏళ్లు అవుతున్నా.. తాగునీరు, డ్రైనేజీ కాలువలను మెరుగు పరచడంలో ప్రభుత్వ అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. 1966లోనే ఏర్పడిన ఆటోనగర్‌లో నేటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఆటోనగర్‌లో మాకు తాగటానికి మంచినీటి సదుపాయం లేదు. పైప్లైన్లు ఏర్పాటు చేశామని అంటున్నారు కానీ, తాగునీటిని అందించలేకపోతున్నారు. మంచినీటిని కొనుక్కుని తాగుతున్నాము. మాకు ఇంతవరకు తాగునీటి సరఫరా లేదు. ఇక్కడ డ్రైనేజి కూడా సమస్యే. మొన్న కురిసిన వర్షాలకు ఇక్కడ ఇంకా తడి ఆరలేదు. వర్షం పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ పని చేయలేదు." -ఆటోనగర్ కార్మికుడు
వర్షపు నీరు రోజుల తరబడి రోడ్లపై నిలువ ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్డింగ్ విభాగంలో పని చేస్తున్న కార్మికులు చెబుతున్నారు. నీటితడి ఉంటే వెల్డింగ్ పనులు చేయటానికి ఆటంకం కలుగుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తామంతా రోజుల తరబడి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
kadapa: మురుగు నీటిలోనే.. ఆరు నెలలుగా..
గతంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆటోనగర్ కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా.. నేటికీ అమలు చేయలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సౌకర్యాలు కల్పించడంలోనూ పాలకులు విఫలమయ్యారని కార్మికులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని ఆటోనగర్‌లో మురుగు కాలువలు నిర్మించడంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
"ఆటోనగర్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆటోనగర్‌లో లక్ష మంది వరకు కార్మికులు ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేదు. అంబులెన్స్‌ను ఆటోనగర్‌కు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము." -ఆటోనగర్ కార్మికుడు