Revanthreddy fires on CM KCR Speech: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని ఫిబ్రవరి చివరివారంలో రద్దు చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. కర్నాటకలో 25మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి 500కోట్ల రూపాయలు ఆఫరిచ్చారని ధ్వజమెత్తారు.
తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని... ఇవాళ బీఆర్ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమన్నారు.
'కేసీఆర్ ఖమ్మం సభ ప్రసంగాన్ని ఆసాంతం విన్నా. గుజరాత్‌లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు. దిల్లీ మద్యం స్కామ్‌లో బీఆర్ఎస్, ఆప్ నేతలు భాగస్వాములు. ఎల్‌ఐసీ, ఎయిర్ ఇండియాను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దేశ భద్రత కోసం కాంగ్రెస్ కర్మాగారాలను నిర్మించింది. కాంగ్రెస్ నిర్మించిన కర్మాగారాలను మోదీ అమ్ముకుంటున్నారు. మోదీ అమ్మకానికి పెట్టిన సంస్థలను ప్రారంభించింది ఎవరు కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించింది. పార్లమెంటులో మోదీకి మద్దతు ఇచ్చింది కేసీఆర్ కాదా ? మోదీ దుర్మార్గుడని ప్రజలు గుర్తించాక తప్పించుకునే ప్రయత్నం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఏళ్ల తరబడి మోదీతో కేసీఆర్ అంటకాగారు: దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున ఎందుకు పోటీ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా తమ సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్ హిమాచల్, దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. దిల్లీ మద్యం స్కామ్‌లో బీఆర్ఎస్, ఆప్ నేతలు భాగస్వాములన్నారు. దేశ భద్రత కోసం కాంగ్రెస్ కర్మాగారాలను నిర్మిస్తే వాటిని మోదీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఏళ్ల తరబడి మోదీతో కేసీఆర్ అంటకాగారన్నారు.
ప్రతి నెలా అప్పు తీసుకువచ్చి దేశాన్ని నడుపుతున్నారు: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 1.40 లక్షల కోట్లకు పెంచారని, అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టు వ్యయాన్ని ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టినట్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాలువల ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్న ఈ సర్కార్.. మరి ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 67 ఏళ్లలో దేశ ప్రధానులు 56 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే... బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందిని ఆరోపించారు. ప్రతి నెలా అప్పు తీసుకొచ్చి దేశాన్ని నడుపుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
'అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టు వ్యయం పెంచారు. గజ్వేల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకు నీళ్లు రావట్లేదు. కాలువల ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. కాలువల ద్వారా నీళ్లు ఇస్తే ఉచిత విద్యుత్ ఎందుకు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తే పంపులు, మోటార్లు అక్కర్లేదు. ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత విద్యుత్‌పై నిజనిర్ధరణ కమిటీకి సిద్ధమా ? కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అంటున్నారు.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: