Police Arrested the Thieves: నేరస్తుల్లో మార్పు తేవాల్సిన జైళ్లు, జ్యువైనల్ హోంలు ఆధునిక నేర ప్రవృత్తి తయారీ కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా పలు నేరాలు చేసి జైలుకు వెళ్లిన ఐదుగురు నిందితులు.. ఓ ముఠాగా ఏర్పడ్డారు. శిక్షా కాలం పూర్తై జైలు నుంచి బయటకు రాగానే అందరూ కలిసి దొంగతనాలకు పథకం వేశారు. పట్టపగలే ప్లాన్ చేసి.. సుమారు 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇంటర్నెట్ కాల్స్ చేసుకున్నారు. అయినా పోలీసులకు చిక్కారు.
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన నాగ దుర్గా ప్రసాద్, లక్ష్మణ్, నాగ దుర్గారావు, రవికుమార్, రారాజులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా మలచుకొని గతంలో జైలుకు వెళ్లారు. జైళ్లో ఐదుగురు స్నేహితులయ్యారు. బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే దుర్గారావు ఇటీవల నిడమానూరులో ఓ రూం ను అద్దెకు తీసుకున్నాడు. మిగిలిన స్నేహితులు కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. తాళం ఉన్న ఇళ్లు కనపడగానే చోరీకి ప్లాన్ వేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఫోన్లో సిమ్ తీసేసి వైఫై వినియోగించి ఇన్స్టా ద్వారా ఫోన్ కాల్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిడమనూరలో దొంగతనం చేసిన పోలీసులకు దొరికిపోయారు.
ఎన్టీఆర్ జిల్లా పటమట పోలీస్స్టేషన్ పరిధిలోని నిడమనూరులో ఈ నెల 9న తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నారు. గురువారం కమాండ్ కంట్రోల్ రూమ్లో రూరల్ డీసీపీ అజిత వివరాలను వెల్లడించారు.
నిడమనూరుకు చెందిన ఐనంపూడి సాంబశివరావు స్థానిక రామాలయం వద్ద నివాసం ఉంటున్నారు. అతని కుమారుడు సుమంత్ హైదరాబాద్లో స్టీల్ వ్యాపారం చేస్తూ అక్కడ నివసిస్తున్నాడు. సాంబశివరావు నిడమానూరు సెంటర్లో ఓ ప్లాట్ తీసుకున్నాడు. ఈ నెల 9వ తేదీన నూతన ప్లాట్లో గృహప్రవేశం నిమిత్తం ఉదయం 11 గంటలకు రామాలయం వద్ద ఉన్న ఇంటికి తాళంవేసి కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. సాయంత్రం 3 గంటలకు తిరిగివచ్చి చూడగా వెనక వైపు తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న 550 గ్రాముల బంగారం, రూ.5 లక్షల నగదు దొంగిలించినట్లు గుర్తించి పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి 25 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరగటాన్ని గుర్తించి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించారు.