Telugudesam special website on Viveka murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఓ కీలక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఆ వెబ్‌సైట్‌లో.. 'వివేకానంద రెడ్డి రాజకీయ నేపథ్యం, ఆయన వంశవృక్షం, హత్య అనంతరం జరిగిన ఘటనల కాలక్రమం, పలుమార్లు మాట మార్చిన జగన్ వ్యాఖ్యలు, కీలక వ్యక్తుల ప్రకటనలు' అని నాలుగు ప్రధాన కేటగిరీలుగా విభజించి.. ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచింది.
వివేకా హత్యపై టీడీపీ వెబ్‌సైట్.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ తాజాగా ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. 'వివేకానంద రెడ్డికి న్యాయం' (https://vivekanandareddykinyayam.in/) అనే పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలతో పాటు ఆయన రాజకీయ నేపథ్యం, వివేకా వంశవృక్షం, హత్య అనంతరం జరిగిన ఘటనల కాలక్రమం, పలుమార్లు మాట మార్చిన జగన్ తీరు, కీలక వ్యక్తుల ప్రకటనలు అనే పేర్లతో హత్య కేసు సమాచారాన్ని పొందుపరిచింది.
వెబ్‌సైట్‌లో జగన్, అవినాష్‌ల వీడియోలు.. అంతేకాదు, వివేకానంద రెడ్డి హత్య చేయబడిన రోజు మొదలుకొని.. కేసు పరిణామ క్రమం, తక్షణ ఘటనలు, రాష్ట్ర ప్రభుత్వ విచారణ, సీబీఐ విచారణ, ఛార్జిషీట్లు అన్న విభాగాల కింద తేదీల వారీగా సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. హత్య జరిగిన రోజు నుంచి నేటిదాకా జగన్, అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు మాట్లాడిన వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఆ తర్వాత వివేకా హత్య కేసుకు సంబంధించి.. వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లు.. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు వక్రభాష్యం చెబుతూ.. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాల వివరాలను వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసింది.
వెబ్‌సైట్‌పై స్పష్టతనిచ్చిన టీడీపీ.. తెలుగుదేశం పార్టీ రూపొందించిన వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్ చేస్తుండడంతో ఆ పార్టీ అధిష్ఠానం స్పందించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్వాపరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని స్పష్టతనిచ్చింది. వివేకా హత్య కేసు సమాచారాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్‌లో చదువుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించామని పేర్కొంది.
గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు.. 2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. ఆరోజు నుంచి ఈరోజు దాకా జరిగిన పరిణామాలు, తేదీలు, కీలక వ్యక్తుల వ్యాఖ్యలు, వార్తలను క్రోడీకరిస్తూ..టీడీపీ రూపొందించిన https://vivekanandareddykinyayam.in/ వెబ్‌సైట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హత్యకు గురైన రోజు నుంచి చోటు చేసుకున్న పరిణామాలను విపులంగా వివరిస్తూ.. వెబ్‌సైట్‌ను రూపకల్పన చేయడం..రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. వివేకా హత్యపై జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు గతంలో ఏం మాట్లాడారు..? ఇప్పుడేం మాట్లాడుతున్నారు..? అనే వీడియోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చగా.. నెటిజన్స్ వాటిని తీక్షణంగా వీక్షిస్తున్నారు.