TDP Public Meeting in Khammam: పార్టీకి పూర్వవైభవం తోపాటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా తెలంగాణలోని ఖమ్మంలో టీడీపీ ఇవాళ భారీ బహిరంగ నిర్వహించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న సభ కోసం సర్దార్ పటేల్ మైదానం ముస్తాబైంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను రాష్ట్రపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో జయప్రదం చేసేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
పసుపుమయంగా మారిన ఖమ్మం: ఖమ్మం నగరమంతా టీడీపీ జెండాలు, ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను అత్యధిక సంఖ్యలో తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు చీరలు ధరించి సభలో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి చంద్రబాబు భారీ కాన్వాయ్ ద్వారా చంద్రబాబు, కాసాని జ్ఞానేశ్వర్ సభాస్థలికి చేరుకోనున్నారు. వీరితోపాటు రాష్ట్ర నాయకులంతా తరలిరానున్నారు. హైదరాబాద్‌లోని నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్న చంద్రబాబు రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలుకనున్నారు.
భారీ ద్విచక్రవాహన ర్యాలీ: సూర్యాపేట సమీపంలో మధ్యాహ్నం భోజనం కోసం ఆగనున్న బాబు.. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోకి చేరుకుంటారు. అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు. కూసుమంచి మండలం కేశవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకోనుండగా.. వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వాగతం పలుకుతారు.
పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం: మయూరి సెంటర్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. పార్టీ బలోపేతంతోపాటు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ పూర్వ వైభవానికి ఈ సభ నాందిపలకుతుందని కాసాని జ్ఞానేశ్వర్ విశ్వాసం వ్యక్తంచేశారు. సభ ముగిసిన తర్వాత పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబు విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి: