TDP MP Kanakamedala Letter to Prime Minister on CBN Health: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. చంద్రబాబు ఆరోగ్యం, రాష్ట్ర ప్రభుత్వం తీరు, జైలు శాఖ అధికారుల వ్యవహారంపై వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినట్లు నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకార చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని.. దేశంలోని అగ్రశ్రేణి వైద్యుల చేత ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని కనకమేడల ప్రధానిని కోరారు.
ప్రధాని దృష్టికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి: చంద్రబాబు అరెస్టు, ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ దృష్టికి కనకమేడల తీసుకెళ్లారు. జీ20 స్పీకర్ల సమావేశంలో ప్రధానిని కలిసిన ఎంపీ కనకమేడల.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినట్లు ప్రధానికి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని ప్రధానికి కనకమేడల తెలిపారు. జైలు అధికారుల తీరు, చికిత్స విషయంలో నిర్లక్ష్యాన్ని కనకమేడల.. ప్రధానికి వివరించారు.
TDP MP Kanakamedala Letter Details: ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖలో పేర్కొన్న అంశాలు..''చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన ఉంది. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినట్లు నివేదికలు వచ్చాయి. రాజకీయ ప్రతీకార చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించే రీతిలో జైలులో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్యం, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం చంద్రబాబుకు అవాంఛనీయ స్టెరాయిడ్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యల వెనక ఉద్దేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నివేదికలు తక్షణ వైద్య సహాయం కావాలని సూచిస్తున్నాయి. తక్షణమే జోక్యం చేసుకుని అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూడాలి'' అని ఆయన ప్రధానిని కోరారు.
TDP MPs fire on YSRCP Ministers: మరోవైపు చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కనకమేడల, కంభంపాటి, రామ్మోహన్ నాయుడులు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు..రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగా కనకమేడల మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారుడు సజ్ఞల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఏసీలు కోరుతున్నారని విమర్శించడం సరికాదని దుయ్యబట్టారు.
''చంద్రబాబు ఆరోగ్యంపై అధిక ఉష్ణోగ్రతలతో అలర్జీ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులే చెబుతున్నారు. సమస్య నివారణకు ఉష్ణోగ్రతలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏసీలు కోరడానికి అత్తారిల్లా అని వ్యంగ్యం చేయడం దిగజారుడుతనం. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని భువనేశ్వరి ఆందోళన చెందారు. బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య రీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చంద్రబాబు కిలో బరువు పెరిగారని స్టేట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. వైద్యులు పరీక్షించి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. డీహైడ్రేషన్ ఉన్నవారు బరువు పెరుగుతారా..?, తగ్గుతారా..? రాష్ట్రాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తిపై ఆందోళన చెందితే హేళనగా మాట్లాడుతున్నారు.''-కనకమేడల రవీంద్రకుమార్, తెలుగుదేశం పార్టీ ఎంపీ
TDP MP Kambhampati Comments: ఎన్నికలకు 6 నెలల ముందు తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కంభంపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కేసు పెట్టారని దుయ్యబట్టారు. జైలులో పరిస్థితులు బాగాలేవని భువనేశ్వరి మొదటి నుంచీ చెబుతున్నారన్న కంభంపాటి.. ప్రభుత్వ తీరువల్లే ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల హేళనగా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో వైద్య సహాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కంభంపాటి కోరారు.
''వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఆయన్ని హింసించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై మా ఆందోళన ప్రభుత్వానికి నవ్వులాటలా ఉంది..?, చంద్రబాబుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలి. ప్రభుత్వం వైద్య సౌకర్యాలు కల్పించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు బయటకు వచ్చాక మళ్లీ పోరాడుతారు. చంద్రబాబు పోరాడకుండా ఆరోగ్యపరంగా దెబ్బతీస్తున్నారు.''- రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ
Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన