TDP Leader Yanamala Letter on State Debts: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేసి, రాష్ట్రాన్ని విష వలయంలోకి నెట్టిందని.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, నిధుల మళ్లింపుపై ఆయన లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో..జగన్ ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో తప్పుడు గణాంకాలు చెబుతోందని దుయ్యబట్టారు. వడ్డీలు కట్టేందుకు.. ఛార్జీలు, పన్నుల బాదుడు నిధులను దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని కోరినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని యనమల మండిపడ్డారు.
Yanamala Letter Details: ''లూటీ కోసం మితిమీరిన అప్పులు చేయడం, వడ్డీల చెల్లిపుల కోసం ఛార్జీలు, పన్నుల బాదుడు, సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి.. జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయం గొంతు కోస్తుంది. ధరలు, ఛార్జీల బాదుడు వల్ల ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 అదనపు భారం మోపారు. రూ.1.14 లక్షల కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్, క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. నిన్న క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించింది. చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్స్‌తోనే ఆర్ధిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారింది.'' అని యనమల లేఖలో వివరించారు.
Yanamala on YCP Wrong Growth Rate: అనంతరం 2019-20లో వృద్ధిరేటు ఎక్కువగా చూపించుకోవడం కోసం టీడీపీ హయాంలో సాధించిన వృద్ధి రేటును జగన్ ప్రభుత్వం తారుమారు చేసిందని యనమల రామకృష్ణుడు ఆగ్రహించారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.6,80,332 కోట్లు (11.02 శాతం) స్థూల ఆదాయం అని ముందస్తు అంచనాల్లో ప్రకటించి, 2018-19 ఆర్థిక సర్వేను విడుదల చేశారని విమర్శించారు. ఈ జీడీపీని రూ.6,21,301 కోట్లకు (4.45) కుదించి 2019-20 ఎకనామిక్ సర్వేలో చూపించారన్నారు. అంతేకాకుండా, 2018-19లో టీడీపీ సాధించిన జీడీపీ కన్నా.. 2019-20లో రూ.53,718 కోట్లు తగ్గించి.. 11.02 శాతం వృద్ధి రేటును 5.36 శాతంకు కుదించారని యనమల లేఖలో వెల్లడించారు.
''2020-21లో కరోనా కారణంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెగెటివ్ వృద్ధిరేట్లు నమోదయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం రొయ్యలు, చేపలు ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని తప్పుడు లెక్కలు చూపారు. ఏకంగా రూ.40 వేల కోట్లు మేర రొయ్యల ఎగుమతులు జరిగాయని అబద్దాలు ముద్రించారు. ఈ తప్పుడు లెక్కలపై, రాష్ట్ర ఆర్ధికస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసి, బహిరంగ చర్చకు రావాలని పిలిచినా.. వైసీపీ నుంచి ఎటుంవంటి స్పందన లేదు.- యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత
Yanamala on YCP: 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు': యనమల