Search Continue in Margadarsi Branches: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలను తీవ్రతరం చేసింది. నిరాధార ఆరోపణలు, అక్రమ కేసులు, అసంబద్ధమైన వాదనలతో మార్గదర్శిపై ఎంతగా బురదచల్లుతున్నా... చందాదారులు సంస్థ పట్ల మరింత నమ్మకం కనబరుస్తుండటంతో... వారిపై వేధింపులకు తెగబడుతోంది. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్స్‌కు సంబంధించిన 37 బ్రాంచిల్లో (Margadarsi Branches) సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల అధికారులు శుక్రవారం చందాదారులపై తీవ్రస్థాయి ఒత్తిళ్లు తీసుకొచ్చారు. వారిని బెదిరించారు. వేళాపాళా లేకుండా ఫోన్లు చేస్తూ మార్గదర్శి కార్యాలయాలకు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. వారు సభ్యులుగా ఉన్న చిట్ గ్రూపులకు సంబంధించి అర్థంపర్థం లేని ప్రశ్నలు వేశారు. మార్గదర్శి చిట్స్ వల్ల తమకు ఎలాంటి సమస్య లేదని.., చెల్లింపులన్నీ సక్రమంగా నిబంధనల ప్రకారమే చేస్తున్నారని చందాదారులు చెప్పినా వినలేదు. వారిని పదేపదే ప్రశ్నలు తిప్పితిప్పి అడుగుతూ మార్గదర్శికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టారు.
చీటీల సొమ్ము చెల్లించడానికి బ్రాంచిలకు వచ్చిన చందాదారులను ఆ డబ్బులు కట్టనివ్వకుండా పలుచోట్ల అడ్డుకుని వెనక్కి పంపించేశారు. తాము ప్రతి నెలా సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నామని... ఇప్పుడు చెల్లించడానికి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ... చందాదారులు సీఐడీ సిబ్బందితో వాదనకు దిగారు. మరి కొన్ని బ్రాంచిల్లో మార్గదర్శి ఏజెంట్లను కార్యాలయాలకు పిలిచి... చిట్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కొన్ని చోట్ల అధికారులే వాంగ్మూలాలు రాసుకుని వాటిపై సంతకాలు చేయాలంటూ.. బ్రాంచి మేనేజర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌కు సంబంధించిన రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా వాటిని బేఖాతరు చేశారు.
గుంటూరు మార్కెట్ సెంటర్ బ్రాంచ్‌లో వృద్ధుడైన ఓ చందాదారును పిలిపించి మార్గదర్శిలోనే చిట్ ఎందుకు కడుతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సమయానికి డబ్బులు చెల్లిస్తున్నారని.., అందుకే నమ్మకంతో ఇక్కడ చిట్ కడుతున్నానని ఆయన సమాధానమివ్వడంతో... మరికొన్ని ప్రశ్నలు వేశారు. పలు చోట్ల మార్గదర్శికి వ్యతిరేకంగా చెప్పాలని చందాదారులపై ఒత్తిడి తెచ్చారు. విజయనగరంలో కొందరు మహిళా చందాదారులను పిలిపించి... ఇవి మీ సంతకాలేనా? ఫోర్జరీ చేశారా? అంటూ ప్రశ్నించారు. అవి తమ సంతాకాలేనని వారు సమాధానమిచ్చారు.
రాజమహేంద్రవరంలో సోదాల పేరిట మార్గదర్శి రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగించారు. పెద్ద మొత్తాల చిట్లు వేసిన చందాదారుల వివరాలు, వారి పాన్‌కార్డు, ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించారు. చందాదారులకు ఫోన్లు చేసి.. మార్గదర్శి కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి తెచ్చారు. సామర్లకోటలో చిట్టీ సొమ్ము కట్టడానికి వచ్చిన ఖాతాదారులను ప్రశ్నించారు. పలు చోట్ల ఏజెంట్లను బెదిరించారు. ఒంగోలులో చందాదారుల జాబితా ఇవ్వాలని..., వారిని కార్యాలయానికి పిలిపించాలని మార్గదర్శి సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చారు.
ఏలూరులో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గురువారం రాత్రంతా మార్గదర్శి కార్యాలయంలోనే బస చేశారు. విజయనగరంలో సీఐడీ డీఎస్పీ గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకూ మార్గదర్శి కార్యాలయంలోనే ఉన్నారు. స్నానం కూడా కార్యాలయంలోనే చేశారు. కర్నూలులో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట వరకూ తనిఖీలు జరిపారు. మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. తాము రాసుకున్న వాంగ్మూలాలపై సంతకాలు చేయాలని మేనేజర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖపట్నంలోని అన్ని బ్రాంచిల్లోనూ గురువారం రాత్రంతా సోదాలు జరిపారు. ఆ అధికారుల బృందం వెళ్లిపోయిన తర్వాత.. శుక్రవారం ఉదయం కొత్త బృందాలు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. పీఎంపాలెంలో మార్గదర్శి సిబ్బందిని నిర్బంధించినట్లుగా వ్యవహరించారు. మూత్రశాలకు వెళ్లడానికి కూడా మార్గదర్శి మేనేజర్‌ను(Margadarsi Manager) అనుమతించలేదు.
ఏలూరు మార్గదర్శి(Margadarsi) కార్యాలయానికి శుక్రవారం చిట్ పనులపై వచ్చిన ఖాతాదారులను అధికారులు లోపలికి అనుమతించలేదు. ఉదయం 10 గంటలకే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఐడీ, రెవెన్యూ, పోలీసు విభాగాలకు సంబంధించిన అధికారులు కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో ఏలూరుకు చెందిన వేణు నాయుడు..., చనిపోయిన తన మావయ్య చిట్‌కు సంబంధించి క్లెయిమ్ గురించి మాట్లాడేందుకు కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన.. కోర్టు ఆదేశాల ప్రకారం కార్యాలయంలో అన్ని పనులు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులుంటే మీరు చూసుకోండి. మీ తనిఖీలతో మాకేం సంబంధం? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని పోలీసుల్ని నిలదీశారు. దీంతో ఎట్టకేలకు ఆయన్ను అనుమతించారు.