Research Balloon in Vikarabad : ఆకాశంలో ఏవైనా మార్పులు జరిగినా.... ఎలాంటి కొత్త వస్తువులు కనిపించినా సాధారణంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఇదే తరహాలో నిన్న సాయంత్రం నుంచి నింగిలో తేలియాడుతున్న కొన్ని వస్తువులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. గాల్లో ఎగురుతున్న వాటి గురించి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈసీఐఎల్ పరిశోధక సంస్థ ప్రకటనతో గంటల తరబడిగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది.
వాతావరణంలో మార్పులపై అధ్యయనాలకు ఈ బెలూన్లను పంపినట్లు వెల్లడించింది. "టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ ఫెసిలిటీ" పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఈ బెలూన్లు ప్రయోగించినట్లు తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరున్నర వరకు ఆకాశంలో కనిపించిన ఈ బెలూన్లు... సుమారు 30 నుంచి 42 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి తిరిగి కిందకు చేరుకుంటాయి. ఈ బెలూన్ల లోపల శాస్త్రవేత్తలు బరువైన పరికరాలను అమర్చారు. వాతావరణానికి సంబంధించిన మార్పులను ఈ పరికరాలు సేకరిస్తాయి. హైదరాబాద్‌తో పాటు విశాఖ, షోలాపూర్‌లో ఆకాశంలోకి వదిలినట్లు పరిశోధకులు తెలిపారు.
హైదరాబాద్‌లో వదిలిన ఈ బెలూన్లు వికారాబాద్ జిల్లా మర్పల్లిలో కిందకు దిగాయి. వీటిని హీలియం బెలూన్లు అని కూడా పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు. ఎక్కడి నుంచి వచ్చిపడిందోనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. దీని గురించి అధికారులకు సమాచారం అందించారు. అయితే అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపినట్లు వివరించారు.
ఇవీ చదవండి: