SC ST Round Table Meet: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం-2013 చట్టసవరణ ద్వారా కాలపరిమితి పెంచి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అలాగే చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని కోరారు.
దళిత, గిరిజన పేదల ప్రజలకు జనాభా దామాషాలో కేంద్ర, రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు పది ఏళ్ల కాలపరిమితితో 2013లో ఉప ప్రణాళిక చట్టం వచ్చిందని.. ఈ చట్టం గడువు 2023 మార్చితో ముగియనుందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, నీతి అయోగ్‌ను తీసుకొచ్చిందని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధంగా దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తూ నిధులను భారీగా తగ్గించి తీవ్రమైన నష్టం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రభుత్వ విధానం కొందరు వ్యక్తుల అభివృద్ధికి దోహపడుతోంది తప్ప ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా అట్టడుగున ఉన్న 23 శాతం దళిత, గిరిజన పేదలకు లాభం లేదని ఆరోపించారు.
ఇవీ చదవండి: