Sankranti Celebrations in Telangana: సంక్రాంతి పండుగ వచ్చిందంటే వాడవాడలా పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరేయడం మన సంప్రదాయం. అయితే పతంగులు, మాంజాల తయారీకి పేరుగాంచిన ధూల్‌పేట్ వీధులు, దుకాణాలు కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులతో ధూల్‌పేట్ దారులన్నీ రద్దీగా మారాయి. ఇప్పటికే పండుగ వాతావరణంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పిల్లలకు పతంగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు, పెద్దలు ఈ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఐదు రోజుల పాటు సురభి నాటకాల ప్రదర్శన నిర్వహిస్తోంది. 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నాటకాల్ని స్థానిక కవులు, కళాభిమానులు ఆసక్తిగా తిలకించారు. మాయాబజార్, శ్రీకృష్ణ లీలలు, సమ్మక్క-సారలమ్మ వీరగాధ, బాలనాగమ్మ పౌరాణిక నాటకాలు ప్రజలను అలరిస్తున్నాయి.
నిజాం కాలేజీలో వంటకాల స్టాల్స్ ఏర్పాటు: ఇటు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రాంగణంలో నోరూరించే వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. వేడుకల్లో ప్రదర్శించిన ప్రత్యేక నృత్యాలు, ఫ్యాషన్ షో, ఆట-పాటలు, గంగిరెద్దుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహం నింపింది.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. నిఖిల్ భరత్ పాఠశాల పిల్లలు కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణమంతా హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, రంగవల్లులతో కళకళ లాడింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి నృత్యాలు చేశారు. పాఠశాలలో జరిగిన సంక్రాంతి వేడుకలు పట్టణ ప్రజలకు కనువిందు చేశాయి. హైదరాబాద్ నగర శివారులో దుండిగల్‌లో శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు, చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్ జియాగూడలో గంగపుత్ర సంఘం నిర్వహించిన ముగ్గులు, మెహెందీ పోటీల్లో మహిళలు, చిన్నారులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలు తమకెంతో సంతోషం కలిగిస్తున్నాయని, సంక్రాంతి ఉత్సవాల రూపంలో భావితరాలకు తాము సాంస్కృతిక వారసత్వాన్ని అందజేస్తున్నామని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ శ్రీ గణేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారేడుపల్లిలోని శెనాయ్ మైదానంలో సంక్రాంతి రంగోలి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఎల్పీనగర్లో బీజేపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో: ఇక్కడ మహిళా సాధికారత, సంక్రాంతి విశిష్టత, విద్యా ప్రాధాన్యం, సాంకేతిక రంగంలో దేశం సాధించిన ప్రగతిపై మహిళలు ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కుట్టుమిషన్లు, విలువైన బహుమతులు అందించారు. రాష్ట్ర మంతటా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగోలి పోటీలు, పతంగులను ఎగరవేస్తూ ఆనంద ఉత్సవాలతో గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్నీ ఎండగడుతూ బిజెపికి వ్యతిరేకంగా పతంగులపై స్లొగన్స్ రాసి, ముగ్గులను వేసి, పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా పిండి వంటలను కట్టెల పొయ్యి పై చేశారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పే కేంద్రప్రభుత్వం చైనా మాంజాలను, చైనా పతంగులను దిగుమతి చేసుకోవడం కేంద్రప్రభుత్వ దిక్కుమాలిన చర్య అని, మా రాష్ట్రానికి వచ్చే నిధులు మాకు కావాలని, మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష పూరితంగా వ్యవరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పతంగుల, ముగ్గుల వేసి రూపంలో నిరసన వ్యక్తం చేశారు.
'చైనా నుంచి పతంగులను దిగుమతి చేసుకోవడం విడ్డూరం': ప్రజలను మోసం చేయడానికి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులని చెబుతూ చైనా దేశం నుంచి పతంగులను, భారతదేశ జండాలను దిగుమతి చేసుకోవడం విడ్డూరమన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా హరిదాసులు బసవన్నలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ మాహిళలు ఆనంధోత్సవాలతో మునిగితేలుతున్నారు. ప్రపంచం ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాలుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో బీజేపీ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బహుమతులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగ అంటేనే సందడి ఇంటిల్లిపాది ఆనందమం, వీధుల్లో రంగురంగుల ముగ్గులు, ఇళ్లల్లో పిండి వంటకాలు వంటి సంస్కృతిని భావితారాలకు అందించే దిశగా అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. చిరుధాన్యాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం లోని అన్ని డివిజన్లో మహిళలు విన్న రంగులతో రకరకాల ముగ్గులు వేసి తమ ప్రతిభ పాటలను ప్రదర్శించారు ఆయా ముగ్గురితో ఆ ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి: