RTC Employees Worried on Higher Pension: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి నేటిదాకా ఇటు పాత పింఛన్ హామీ నేరవేరక, అటు వేతన సవరణ బకాయిలు విడుదలకాక.. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాలతో అధిక పింఛన్ పేరిట అదృష్టం తలుపుతట్టినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీరుతో దాన్ని వినియోగించుకోలేక ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పింఛన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, అర్హత కోల్పోయిన వారికి చెల్లింపు గడువును పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
PF Trust on Higher Pension: 2020లో సమారు 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్.. ప్రభుత్వంలోకి విలీనం చేశారు. కానీ, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్న హామీని మాత్రం మరిచారు. అంతేకాకుండా, ఓపీఎస్ అమలు కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నా.. కనీసం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. 40 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అధిక పింఛన్‌కు అర్హత పొందినట్లు పీఎఫ్ ట్రస్టు ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేశారు.
విజయవాడ బస్ స్టేషన్‌లో డిజిటల్ లావాదేవీలకు స్వస్తి- ప్రయాణికులు అవస్థలు
1200 Employees Lost High Pension: అంతేకాకుండా, ఉద్యోగులు వారి సర్వీసును బట్టి నిర్ణీత మొత్తాన్ని పీఎఫ్ ట్రస్టుకు జమ చేస్తే అధిక పింఛన్ వర్తింపజేస్తామని పీఎఫ్ ట్రస్టు తెలిపింది. ఆ మేరకు గడువును నిర్ణయించి నెల నెలా డిమాండ్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్ ట్రస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 3 వేల మందికి పైగా ఉద్యోగులు డిమాండ్ నోటీసులు అందుకున్నారు. కానీ, వీరిలో 1200 మంది ఉద్యోగులు నగదు చెల్లించలేకపోయారు. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత అధిక పింఛన్ వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. అయితే, నోటీసులు అందుకున్న ఉద్యోగులు నగదు చెల్లింపుల కోసం ఇప్పటికీ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు.
Employees Unions Fire on CM Jagan: ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పింఛన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని శాసనసభా వేదికగా హామీ ఇచ్చిన సర్కారు.. దాన్ని విస్మరించిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన రూ. 840 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, అధిక పింఛన్ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. అధిక పింఛన్ అర్హత కోల్పోయిన వారికి వెంటనే చెల్లింపు గడువును పెంచి, ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?
''ఎప్పటి నుంచో ఆర్టీసీ ఉద్యోగులంతా నెలనెలా వచ్చే వేతనంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ ట్రస్టు, సీసీఎస్, ఎస్‌ఆర్‌బీఎస్ (SRBS), ఎస్‌బీటి (SBT)లో పొదుపు చేసుకుంటున్నాం. ఏ అవసరం వచ్చినా.. వాటి నుంచి నగదు తీసుకునేవాళ్లం. కానీ, పీఎఫ్ ట్రస్టులో ఉన్న సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం వాడేసింది. దాచుకున్న డబ్బును తీసుకోవాలనుకున్నా..ఇప్పుడు పీఎఫ్ ట్రస్ట్‌లో డబ్బు లేదు. మేము పొదుపు చేసుకుంటున్న కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచైనా రుణం తీసుకుందామంటే అక్కడా నిల్వలు లేవు. విలీనం తర్వాత SRBS, SBTని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సొమ్మునూ ఉద్యోగులకు ఇవ్వలేదు. దీని వల్ల అధిక పింఛన్‌కు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందిపడుతున్నాం.''-ఆర్టీసీ ఉద్యోగులు
కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు