Retired AP Govt Pensioners EKYC Troubles Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛనుదారులకు, ఉద్యోగులకు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణయం వల్ల దాదాపు 3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెన్షన్‌దారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలనే ప్రభుత్వ నిబంధన వల్ల పెన్షనర్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.
ఈకేవైసీ తప్పనిసరి.. ఈ ఏడాది జనవరి నెలలో విశ్రాంత ఉద్యోగ పింఛనుదారులు, ఉద్యోగులు ఈకేవైసీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛనుదారులంతా తప్పకుండా జీవన ధ్రువపత్రాలు సమర్పించి, ఈకేవైసీని చేయించుకోవాలని పేర్కొంది. హెర్బ్ యాప్ సాయంతో సంబంధిత పింఛనుదారుడు తన సీఎఫ్‌ఎంఎస్ ఐడీకి ఈకేవైసీ చేయించి, ఆ వివరాలను ఉప ఖజానా అధికారికి ఆన్‌లైన్‌లో పంపించాలని తెలిపింది. ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి నంబరునే వినియోగించాలని, జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా గానీ, హెచ్‌సీఎం పెన్షన్ లాగిన్ ద్వారా గానీ పత్రాలను సమర్పించాలని వెల్లడించింది.
ఈకేవైసీపై ట్రెజరీ అధికారులు ప్రకటన.. తాజాగా ఈకేవైసీకి సంబంధించి ఆయా జిల్లాల ట్రెజరీ అధికారులు మరో ప్రకటన చేశారు. ఈనెల 10వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని.. దీనికోసం జిల్లాలోని పింఛనుదారులు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీకి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడిన ఫోన్ నెంబర్‌ను, ప్రస్తుత నివాస చిరునామాను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. అప్పటి ఫోన్ నంబరు అందుబాటులో లేకపోతే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలకు లేదా పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు.
3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈకేవైసీ విధానంపై ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈకేవైసీ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపు 3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారని.. పెన్షన్‌దారుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 10వ తేదీ నాటికి పెన్షన్‌దారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు పెట్టడం దారుణమని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల 60 వేల మంది పెన్షన్‌దారులు ఉండగా, వారిలో సుమారు లక్ష పాతిక వేల మంది కుటుంబ పెన్షనర్లు ఉన్నారని.. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు.
హామీ ఇచ్చారు.. హఠాత్తుగా పూర్తి చేయాలన్నారు.. పెన్షన్‌దారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ..''పెన్షన్ అందపోవడంతో కుటుంబ అవసరాల కోసం బయట అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ ప్రభుత్వం.. జీవో నంబర్ 7 పేరుతో విశ్రాంత ఉద్యోగులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని జీవోను విడుదల చేసింది. అయితే, 11వ తేదీ జీవో ఇచ్చి 20 తేదీన తుది గడువుగా నిర్ణయించింది. కేవలం 9 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులు ఈకేవైసీ చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటుందని.. సంఘ ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. సమస్యపై స్పందించిన ఉన్నతాధికారులు.. పెన్షన్‌దారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం హఠాత్తుగా ఈనెల 10వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పడం మాకు అర్థం కాలేదు. ఇదేమని అడిగితే అధికారుల నుంచి స్పందన లేదు.'' అని అన్నారు.
ఈ విషయాని పై అధికారులకు వివరించాం.. అనంతరం ఈకేవైసీ పూర్తి చేస్తేనే పెన్షన్ వస్తుందని అధికారులు చెప్పడంతో పెన్షన్ దారులు ఆందోళన చెందుతున్నారని సంఘ ప్రతినిధులు తెలిపారు. సైబర్ నేరాలు జరగకుండా ఉండేందుకే తాము ఈకేవైసీ అడుగుతున్నామని.. ప్రభుత్వం చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. ప్రభుత్వం వద్ద అధునాత సాంకేతిన పరికరాలు ఉంటాయని, ఎవరైనా తప్పు చేస్తే త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా.. తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆనాలోచిన నిర్ణయం తీసుకుందని తాము ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. కానీ, వారి నుంచి ఎటువంటి సహాయం పొందలేకపోయమని వాపోయారు.
ఈ సమయంలో ఈ నిబంధన అవసరమా..?.. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఈకేవైసీ పేరుతో ఇబ్బందులు పెట్టడం, ఈకేవైసీ అయితేనే పెన్షన్ వేస్తామని చెప్పడం సమంజసం కాదని పెన్షన్‌దారులు వ్యాఖ్యానిస్తున్నారు. పెన్షన్ దారులందరూ వయస్సు పై బడిన వారు కావడంతో అందరి వద్ద స్మార్ట్ చరవాణిలు లేవని.. ఉన్నా కొందరికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియటంలేదని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,60,000 మంది పెన్షనర్లుల్లో 90 శాతం మంది వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఏ పని చేయలేని స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రతినెల అందిస్తున్న పెన్షనే తమ జీవనాధారమని.. ఇటువంటి సమయంలో ఈకేవైసీ చేస్తేనే పెన్షన్ అంటే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని, ఈకేవైసీ నిబంధనను తొలగించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి