OLD AGE HOME: విజయవాడలోని ఓ వృద్ధాశ్రమంలో వాళ్లంతా దాదాపు 60ఏళ్లకు పైబడిన వృద్ధులు. వారంతా అక్కడ ఆశ్రయం పొందుతున్నవారే. అందరూ ఉన్నా అనాథలుగా మారిన ఆ వృద్ధులకు.. వాసవ్య మహిళా మండలి, బిలియన్ హార్ట్స్ బీటింగ్ సంస్థలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వృద్ధాప్యంలో బాధలు మరచిపోయి మానసికోల్లాసం నింపాలనే ఉద్దేశంతో.. నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ సంస్థల నిర్వాహకులు. అందులో భాగంగా 'గ్లోరి ఆఫ్ ద గ్రే' పేరుతో ర్యాంప్ వాక్ నిర్వహించారు. సాధారణంగా ర్యాంప్ వాక్ ప్రదర్శనలో ఫ్యాషన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంటాయి. కానీ, ఈ ర్యాంప్ వాక్‌లో వృద్ధులు ప్రదర్శించిన ప్లకార్డుల్లోని సందేశాలు అందరినీ ఆలోచింపజేసేలా.. కంటతడి పెట్టించేలా ఉన్నాయి
"తల్లిదండ్రులను చూడటం భారంగా భావిస్తున్నారు. కానీ, ఒక బాధ్యత, ప్రేమ అనే భావం ఉండటం లేదు. మేము దాదాపుగా 29 సంవత్సరాలుగా దీనిని నడిపిస్తున్నాము. దీని ద్వారా మేము తెలుసుకున్న ఆంశం ఏంటంటే.. 90 శాతం వృద్ధాశ్రమలలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఉన్నవారే. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తులను రాయించుకుని, రోడ్ల పైన వదిలేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న వారి కోసం ఈ వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నాము." -డాక్టర్ కీర్తి, వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు
వివిధ రకాల వేషధారణలు ధరించి.. ప్లకార్డుల ద్వారా వారి మనస్సులోని మాటలను బయటకు చెప్పుకున్నారు. వీరికి మేకప్, దుస్తులను యువతులు రూపొందించారు. ప్రదర్శన అనంతరం డ్యాన్స్‌లు వేశారు. వీరి ప్రదర్శనకు హాలంతా చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. కనిపెంచిన బిడ్డలు రోడ్డుపై వదిలేసినా.. ఈ సంస్థ మాకు ఆశ్రయమిస్తూ.. బాధలను దూరం చేస్తుందంటున్నారు వృద్ధులు. అలాగే ఇలాంటి కార్యక్రమాల ద్వారానైనా పిల్లల్లో మార్పు వచ్చి.. వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని భావిస్తున్నామని వారు అంటున్నారు.
"నాలుగేళ్ల క్రితం నా భర్త మరణించాడు. నా కుమారుడు ఆస్తి తన పేరు మీద రాయించుకున్నాడు. నా సంరక్షణ చూసుకోవటం లేదు. ఇక్కడ మాకు వీళ్లు ఆశ్రయం కల్పించారు." -ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలు
"నాకు ఒక్కడే కుమారుడు. ఆస్తులు, బంగారం కూడా తీసుకున్నాడు. తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలివేయకుండా.. ఉన్న దాంట్లో ఒక్క ముద్ద పెట్టండి. ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కల్గించింది. మాకు ఉన్న బాధలను మరిపించేలాగా ఈ కార్యక్రమం ఉంది." -ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలు
ఇవీ చదవండి: