AP Weather Updates: ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రేపటిలోగా ఇది వాయుగుండంగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి దక్షిణ ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకూ విస్తరించిన రుతుపవన ద్రోణి కూడా క్రియాశీలకంగా మారినట్టు ఐఎండీ తెలిపింది.
వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లోనూ చాలా చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ నెల 27 వరకూ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
Water Flow to Godavari: ప్రస్తుతం గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని.. ధవళేశ్వరం వద్ద 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్తున్నట్టు ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ తెలిపింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 31.7 మీటర్లకు నీటిమట్టం చేరింది. 8.09 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లో అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోనేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
Rains in AP Districts: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు మచిలీపట్నం నగర పాలక సంస్థలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. డ్రైవర్స్ కాలనీ, సుందరయ్య నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు రావడంతో ఆయా కాలనీల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాలనీల్లోకి చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టామని కమిషనర్ చంద్రయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా.. గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంపలగూడెం నుంచి విజయవాడ వెళ్లటానికి కూడా ఇదే రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తోంది. వీరులపాడు మండలం పల్లంపల్లి నందిగామ మండలం దాములూరు గ్రామాల మధ్య ఏటిపై ఉన్న చెప్టా మీదుగా నుంచి నీరు ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వైరా కట్టలేరుకు వరద నీరు చేరుతోంది. ఇక్కడ వంతెన నిర్మించినా వంతెనకు రెండువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల రాకపోకలకు వీలు పడటం లేదు.