Patients Problems in Vijayawada Old Govt Hospital: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. గర్భిణులు, బాలింతలకు పడకల కొరతతోపాటు మౌలిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అదనపు వసతి కల్పన కోసం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు. నగరం నడిబొడ్డున ఉన్న పాత ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వం అందుకు తగ్గ సదుపాయాలు కల్పించడం లేదు.
విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు, రోగులు వస్తుంటారు. సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోని ఖమ్మం, మధిర తదితర ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు.
చిన్నారులు, గర్భిణుల వార్డులలో అందే సేవలకు ఇక్కడ నిత్యం రద్దీ ఉంటుంది. కానీ సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారంతా అవస్థలు పడుతున్నారు. నిత్యం ఇక్కడ 50కి పైగా ప్రసవాలు జరుగుతాయి. ఓపీ రోగుల సంఖ్య వెయ్యికి పైగా ఉంటుంది. ప్రసవం కోసం చేరే గర్భిణులకు, బాలింతలకు మంచాల కొరత ఎప్పటి నుంచో ఉంది. రద్దీ వేళల్లో ఒక పడకను ఇద్దరికి కేటాయిస్తున్న ఘటనలున్నాయి.
గైనిక్, పిడియాట్రిక్ వార్డుల్లో పడకలు పెద్దసంఖ్యలో ఉండగా.. ఫ్యాన్లు మాత్రం రెండు నుంచి మూడు మాత్రమే ఉన్నాయి. దీంతో సరిపడా ఫ్యాన్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, వారి సహాయకులు తాగునీటి కోసం రెండస్తులు కిందకు దిగి రావాల్సిందే. పైన వార్డుల్లో వాడుకలకు తప్ప తాగేందుకు నీరు ఉపయోగపడదు.
ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటుచేసిన రెండు వాటర్ ప్లాంట్లే ఆధారం. ప్రతి వార్డులోనూ తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంచాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. ఆస్పత్రిలో రోగులకు సహాయకులుగా ఉండేందుకు వచ్చిన వారికి పురుషులు, మహిళలకు విశ్రాంత గదులున్నప్పటికీ.. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. రోగుల సహాయకులు చెట్ల కిందే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి లోపల మరుగుదొడ్ల నిర్వహణ సైతం అధ్వానంగా ఉందని చెబుతున్నారు.
GGH Sanitation: పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందుల్లో రోగులు
వసతి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అదనపు భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఆస్పత్రిలో సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆస్పత్రి అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత ఆస్పత్రిలో వసతులను మెరుగపర్చాలని, తమ సమస్యలను పరిష్కరించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
"వాటర్ పైపు ఒక్కటే ఉంది. దీని వలన కిందకి రావాలంటే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూడా ఒక్కటే ఉంది. ఇది ఒక్కొక్కసారి రావడం లేదు. కనీసం మూడు ఉంటే బాగుంటుంది. చాలా ఎక్కువుగా రోగులు వస్తున్నారు. లోపల అస్సలు ఖాళీగా లేదు".- రోగి బంధువు
"మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. అసలు వాటర్ రావడం లేదు. లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. రోగులు, వారి బంధువులు కూడా లైన్లలో ఉంటున్నారు. ఒక్కొక్క బెడ్‌కి ఇద్దరు రోగులు ఉన్నారు. అస్సలు బెడ్లు ఖాళీగా లేవు". - రోగి బంధువు
Dialysis Problems: ఆస్పత్రిలో కరెంట్ కష్టాలు.. కిడ్నీ రోగుల అవస్థలు