Pathholes and Highly Damaged Vanukuru Maddur villages Road: అడుగుకో గొయ్యి, గజానికో గుంత, తటాకాన్ని తలపించే రహదారులు. ఎప్పుడు ఎక్కడ ప్రమాద బారిన పడతామో ఊహించలేని పరిస్థితి. పది నిమిషాల్లో గమ్యానికి చేరుకోవాల్సిన దూరానికి కూడా గంట పడుతోందని.. వాపోతున్న ప్రయాణికులు. ఇక వర్షాలు పడితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోందని గగ్గోలు పెడుతున్న ప్రజలు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. విజయవాడకు సమీపంలోనే కొన్ని గ్రామాలకు ముఖ్యమైన రహదారి దుస్థితి ఇది.
రహదారిపై ఏర్పడిన గుంతల నిండా నీళ్లు చేరి.. చెరువును తలపిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరకు బానే ఉన్న తారు రోడ్డు.. ఇప్పుడు ఈ దుస్ధితిలో కనిపిస్తోంది. వాణిజ్య నగరం విజయవాడకు అతి సమీపంలోని వణుకూరు - మద్దూరు గ్రామాల మధ్య ప్రజలకు ఆధారమైన కీలకమైన రహదారి అది. కానీ, నేడు ప్రయాణించాలంటేనే కీళ్లు విరిగిపోతున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
అధ్వాన్నంగా రహదారులు .. ఇబ్బందుల్లో వాహనదారులు
ఈ మార్గంలో పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ఆయా గ్రామాల ప్రజలు ఏ చిన్న ఆపద వచ్చినా అవసరం వచ్చినా విజయవాడకు వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. నాలుగేళ్ల క్రితం వరకు సక్రమంగా ఉన్న ఈ రహదారి క్రమంగా దెబ్బతింది. తొలుత చిన్నపాటి గొయ్యిలు ఏర్పాడినప్పుడే.. తారు వేసి ఉండి ఉంటే ఈ దుస్ధితి వచ్చేది కాదంటున్నారు వాహనదారులు. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చిన్నపాటి గుంతలు కాస్తా గోతులుగా మారాయి. ఏటికేటి పెరిగి పెద్దవై నాలుగేళ్లలో చిన్నపాటి చెరువుల్లా మారాయి. రోడ్డుపై ఉన్న తారు, కంకర మొత్తం చెదిరిపోయింది. భారీ వాహనాల ధాటికి మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు, ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు.
విజయవాడలో నివసించే పేదలకు వణుకూరులో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించింది. 28 వేలకుపైగా ఇళ్ల పట్టాలివ్వడంతో పేదలంతా ఇక్కడే తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అప్పో సప్పో చేసి ఇళ్లు నిర్మించుకుందామనుకుంటే వెళ్లేందుకు దారి కూడా కనిపించడం లేదు. అత్యవసర పరిస్ధితుల్లో రహదారి వెంట అంబులెన్సులు రావని.. వచ్చినా పది కిలోమీటర్ల అవతలే ఆగిపోతున్నాయని.. అక్కడికి వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతోందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
"రోడ్డు బాగాలేదు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ప్రయాణం చేయలేకపోతున్నాము. ప్రభుత్వమే పట్టించుకుని రోడ్లు బాగు చేయాలి." -ప్రయాణికులు
"బండ్లు గుల్లవుతున్నాయి. మనుషులం గుల్లవుతున్నాం. కిరాయికి వెళ్తే 300 వస్తే రిపేరుకు 500 పెట్టాల్సి వస్తోంది. ఏమి చేయలేని పరిస్థితి." -ఆటో డ్రైవర్