Gampalagudem collapsed Bridge : కట్లేరు వాగుపై ఎన్నో గ్రామాలను కలిపే కీలక వంతెన అది. ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు అదో వారధి. ఇంతటి కీలకమైన వంతెన కుప్పకూలి... ఐదేళ్లయినా ఇంతవరకూ అతీగతి లేదు. తాత్కాలికంగా అప్రోచ్ రహదారి (Approach road) నిర్మించడం, వర్షానికి కొట్టుకుపోవడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. ఇక్కడ 26 కోట్ల రూపాయలతో వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.
BRIDGE: ఇది ప్రజలు నిర్మించుకుంటున్న వారధి.. ఎక్కడో తెలుసా?
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం - వినగడప గ్రామాల మధ్య ఉన్న ఈ వంతెన 2018లో కుప్పకూలింది. దీంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖమ్మం, భద్రాచలం, ఇతర ప్రాంతాల నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రావాలంటే ఈ వంతెన వారధిగా ఉండేది. ఇటు విజయవాడ, నూజివీడు, చీమలపాడు వంటి ప్రాంతాలకు, అటు తిరువూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఎ.కొండూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు జరుగుతుంటాయి. వంతెన ఐదేళ్ల క్రితం కూలిపోవడంతో పట్టించుకున్న వారు కరవయ్యారు. తాత్కాలికంగా పలుమార్లు కట్లేరు వాగుపై అప్రోచ్ రహదారి నిర్మిస్తున్నప్పటికీ వర్షాలకు వాగు పొంగి కొట్టుకుపోతోంది. ఈ ఐదేళ్లలో వాగు ఉద్ధృతికి పలుమార్లు అప్రోచ్ రహదారి కొట్టుకుపోయింది. ప్రస్తుతం తాత్కాలిక రహదారిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో అటు, ఇటు వెళ్లే వాహనాలు (Vehicles) ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నాయి. గంటల తరబడి తమ వంతు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Krishna River Bridge issue: వారధి కోసం ఎదురుమొండి ప్రజల 'ఎదురీత'
ఇక ప్రమాదాల సంగతి సరేసరి. ఆటో, మినీ వ్యాన్ వంటివి వాగులోకి బోల్తా కొట్టాయి. అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డారు. రాత్రయితే ప్రయాణం మరింత ప్రమాదభరితంగా మారింది. ఓపక్క వాగు ఉండటంతో వర్షాకాలంలో భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వరద తీవ్రమైతే తాత్కాలిక రహదారిపై వెళ్లే అవకాశమే లేదు. వంతెనకు అటు, ఇటు గంపలగూడెం - వినగడప మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉండగా... వర్షం పడితే చుట్టూ తిరిగి రావడానికి 25 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. వంతెన వద్దకు వచ్చేటప్పటికీ ఎత్తైన తాత్కాలిక రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయేమోనని వాహనాల్లో ప్రయాణికులు గుండెలు గుప్పెట పట్టుకుంటున్నారు. తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు.
రెండు రాష్ట్రాల పరిధిలోని వందలాది గ్రామాలను కలిపే వంతెనను నిర్మించడంలో జరుగుతోన్న జాప్యంపై స్థానికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో తిరువూరులో ముఖ్యమంత్రి పర్యటన (Chief Minister's visit) సందర్భంగా కట్లేరు వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది హామీగానే మిగిలింది తప్ప.. అడుగు ముందుకు పడలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నప్పటికీ కొత్త వంతెన నిర్మాణంపై కదలిక లేదు.
భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకల నిలిపివేత.. వారధి చరిత్రలోనే రెండోసారి