New bride Suicide in Medchal : పెళ్లయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదం నెలకొంది. చరవాణి (స్మార్ట్‌ఫోన్) విషయంలో తలెత్తిన గొడవ నవవధువును ప్రాణాలు తీసుకునేలా చేసింది. తెలంగాణలోని జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వై.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకి చెందిన కమల, జనార్దన్‌రెడ్డి దంపతుల కుమార్తె శైలు (20), వైయస్‌ఆర్ జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు గంగాప్రసాద్‌రెడ్డికి ఈ ఏడాది అక్టోబరు 16న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
పెళ్లయిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లోని చింతల్ శ్రీసాయికాలనీలోని ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. గంగాప్రసాద్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, శైలు ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆమె స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగించడం, వివాహానికి ముందు కూడా ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతుండడాన్ని తల్లిదండ్రులు వారించినా ఆమె తీరు మార్చుకోలేదు. వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో ఇలాగైనా ఆమెలో మార్పు వస్తుందని పెళ్లి చేశారు.
అనంతరం కూడా ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతుండడం, వీడియో రీల్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుండడంతో ఫోన్‌కు దూరంగా ఉండాలని భర్త పలుమార్లు నచ్చజెప్పినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట భర్త ఆమె చరవాణికి లాక్(కొత్త పాస్‌వర్డ్) చేశారు. బుధవారం రాత్రి ఆమె తన ఫోన్ లాక్ తొలగించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భర్త వెంటనే వారి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. దీంతో ఫోన్‌లోనే తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె స్పందించకపోవడంతో ఆమె తల్లి విజయవాడ నుంచి కుమార్తె ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శైలు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: