Mutyalaraju attended hearing court case: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, స్థలాన్ని ఆక్రమించి వేడుకలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ షేక్ సిలార్ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. సర్వేచేసి, పాఠశాల స్థలంలో ఆక్రమణలు ఉంటే తొలగించాలని, ప్రహరీ నిర్మిచాలని 2020 నవంబర్ 3న అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు, తదితరులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో షేక్ సిలార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.
న్యాయస్థానం ఆదేశాలతో గత డిసెంబర్ 29న ముత్యాలరాజు, తదితర అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాల అమలు కోసం తీసుకున్న చర్యల వివరాల రికార్డులను తమ ముందు ఉంచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఉండ్రాజవరం తహశీల్దార్‌ను ఆదేశించారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తూ అధికారులు హాజరుకావాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ఇతర అధికారులు తాజాగా జరిగిన విచారణకు హాజరయ్యారు.
ఉండ్రాజవరం తహశీల్దార్ రికార్డును కోర్టు ముందు ఉంచగా.. కలెక్టర్ ఆ వివరాలను న్యాయస్థానానికి అందజేయలేదు. ముత్యాలరాజు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత కలెక్టర్ ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా లేరన్నారు. ముత్యాలరాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహించడం లేదన్నారు. దీంతో రికార్డును కోర్టు ముందు ఉంచలేదన్నారు.
వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత కలెక్టర్‌ను రికార్డు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ముత్యాలరాజను హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్‌జీపీ కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. రికార్డును కోర్టు ముందు ఉంచినట్లయితే మినహాయింపు విషయాన్ని పరిశీలించేవారమని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: