125 feet Ambedkar statue : విజయవాడ స్వరాజ్ మైదానంలో తలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ పనులను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. ఇప్పటికే పునాది పనులు పూర్తి అయ్యాయని.. నేటి నుంచి అంబేడ్కర్ విగ్రహ పనులు ప్రారంభమయ్యాయని మంత్రులు తెలిపారు. ఏప్రిల్ 14 నాటికి అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి చేస్తామన్నారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని.. మాటిచ్చి తప్పారని విమర్శించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నగరంలో కోట్లాది రూపాయలతో అంబేడ్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. విగ్రహ పనులు త్వరగా పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నారని తెలిపారు. విగ్రహ ఏర్పాటు పనులు జగనే ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహంతో పాటు.. సమావేశ మందిరం, పార్కు, గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు.
అంబేడ్కర్ భావాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామన్నారు. దేశంలోనే అంబేడ్కర్కి దక్కిన గొప్ప గౌరవం ఈ విగ్రహ ఏర్పాటేనని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ పనులు ప్రారంభించిన వారిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు.
మా అందరి ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ దేశంలో బాబా సాహేబ్ అంబేడ్కర్ గారికి సముచితమైన గౌరవం ఇవ్వాలని ఆయన ఆలోచన విధానం.. భావి తరాలకు ఉపయోగ పడే విధంగా.. ఒక మార్గదర్శకంగా ఉండాలని.. అంబేడ్కర్ భావాలను.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని తరతరాలు మరలా.. తల ఎత్తుకు చూసే విధంగా అంబేడ్కర్ గారి విగ్రహం విజయవాడలో పెట్టి ప్రపంచంలోని ప్రతి యాత్రికుడు విజయవాడ రావాలి.. అంబేడ్కర్ గారి విగ్రహం చూడాలి అని ఆశతో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.- మేరుగు నాగార్జున, మంత్రి
ఇవీ చదవండి: