Minister Buggana Comments on Taxes: వాణిజ్య పన్నుల శాఖలోనూ చాలా సంస్కరణలు అమలు చేశామని.. ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో పాలన విధానం అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పన్నుల చెల్లింపు రిజిస్ట్రేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఆడిట్ లాంటి ప్రక్రియలు వేర్వేరుగా జరిగెేట్లు చూస్తున్నట్లు వివరించారు. వ్యక్తుల పరంగా పొరపాట్లు జరగకూడదని ఈ తరహా విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ కార్యాలయం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీలర్లు, ట్రేడర్లు వెంటపడి పన్నులు కట్టించడం కంటే వారే స్వయంగా పన్నులు చెల్లించేలా చేస్తున్నామన్నారు. డీలర్లను వేధించే చర్యలు ఎక్కడా లేవని.. ఎక్కడైనా పొరపాట్లు జరిగితేనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 28వేల 103 కోట్ల రూపాయలు పన్నులు ద్వారా వసూలు అయ్యిందని.. అంతకు ముందు ఏడాది 23వేల 386 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అయ్యిందని వెల్లడించారు.
ఆ అంశంపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా: సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST)తో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పాలన రాదు, ఆదాయం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. పాలన మంచిగా లేకపోతే గడచిన నాలుగు సంవత్సరాలుగా పన్ను వసూళ్లు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారులు అన్ని బాగుంటే ఎక్కడో దెబ్బ తిన్న ఒక్క రోడ్డు గురించి మీడియా రాస్తోందని విమర్శించారు. గతంలో కంటే మెరుగ్గా రహదారులపై ప్రభుత్వం ఖర్చు చేస్తోందని స్పష్టం చేశారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యం అయ్యాయని తెలిపారు. కొవిడ్ కష్టాలు ఉన్నప్పటికి ఎక్కడా సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదని గుర్తు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తలో మాట మాట్లాడుతున్నారని.. ఆర్థిక పరిస్థితిపై వారిద్దరి తోను బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని.. మరి టీడీపీ ఇచ్చిన హామీలు ఉచితాలు కావా అని నిలదీశారు. వైసీపీ కంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు కదా అని బుగ్గన విమర్శించారు.
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం: స్కిల్ కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.