ration distribution vehicles issues: ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి బ్యాంక్‌ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎండియూ ఆపరేటర్ల సంఘం నాయకులు విజయవాడలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం బియ్యం, నిత్యావసరాలను రేషన్ కార్డుదారుల ఇంటివద్దే అందించేందుకు 9,260 వాహనాలను రూ.539 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు.. 60శాతం రాయితీపై ఇచ్చారు. ఈ వాహనాలకు... ప్రతీనెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్లు వినియోగించుకుంటారని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఆటోలకు చెందిన ఇన్సురెన్స్ డబ్బుల విషయంలో బ్యాంక్‌లు అనుసరిస్తున్న తీరుపై ఎండియూ ఆపరేటర్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేసింది.
రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేదంటే, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియూ ఆపరేటర్ల సంఘం నాయకులు విజయవాడలో తెలిపారు. ఎండియూ వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులను ప్రభుత్వం కడతానని చెప్పినప్పటికీ బ్యాంకు వారు ఇష్టానుసారం ప్రతి ఆపరేటర్ ఖాతా నుంచి 18 వేల రూపాయలు నుంచి 23 వేల వరకు తీసుకుంటుందన్నారు. అలా తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నామన్నారు. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోలను జిల్లా మండల స్థాయి అధికారులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. గత ఐదు నెలలుగా ఐసిడిఎస్ మధ్యాహ్న భోజన పథకం పంపిణీ చేసిన కమిషన్ వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మార్చి 30వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేసే వాహనాలను నడపలేమని తెలిపారు.
' రెండు సంవత్సరాల నుంచి రేషన్ పంపిణీ వాహనాలతో నిత్యావసర సరకుల పంపిణీ విజయవంతంగా నిర్వహించాం. గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినా... బ్యాంక్ ఖాతాల నుంచి కట్ అయిన డబ్బులు ఇప్పటి వరకు మళ్లీ మా అకౌంట్లో పడలేదు. మంత్రులు, సీఎం చెప్పినా డబ్బులు కట్ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహణాలు ఉన్నాయి. వారందరికీ డబ్బులు కట్ అయ్యాయి. ఎండియు ఆపరేటర్స్‌కి ప్రభుత్వం ఇన్స్రెంన్స్ ఇవ్వాలి అని కోరుతున్నాం. గత ఐదు నెలలుగా మేమంతా అంగన్ వాడి మిడ్డే మిల్స్ కు సప్లై చేస్తున్నాం. మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటన్నాం.'- మరుపిళ్ల వెంకట్, ఎండియూ ఆపరేటర్ల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు
ఇవీ చదవండి: