Mala Caste leaders fire on Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఏకమై.. వచ్చే ఎన్నికల్లో మనల్ని (మాలలను) అణగదొక్కుతున్న జగన్ మోహన్ రెడ్డిని శాశ్వతంగా సాగనంపాలని.. తెలుగుదేశం పార్టీ మాల నాయకులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలో ఎంతో గౌరవంగా బతికిన మాలలపై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. దారుణమైన దాడులకు తెగబడటమే కాకుండా.. గతంలో ఉన్న 27 సంక్షేమ పథకాలను తీసేసి మోసం చేసిందని ఆగ్రహించారు. గత నాలుగేళ్ల నుంచి మాలలను అన్ని రకాలుగా దెబ్బ తీస్తున్న ఈ జగన్‌ను.. వచ్చే ఎన్నికల్లో ఓడించి, మళ్లీ చంద్రబాబు నాయుడికి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
అట్టహాసంగా మాలల ఆత్మీయ సమావేశం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈరోజు మాలల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, డీజే సందడి, సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొంది. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, యువత, ప్రజలు తరలిరావడంతో కేంద్ర కార్యాలయం కిక్కిరిసింది. ఈ సమావేశానికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అధ్యక్షత వహించగా.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మాలల ఆత్మీయ సమావేశానికి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమావేశంలో జగన్ ప్రభుత్వం వచ్చాక.. మాలలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, తీసేసిన పథకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు నేతలు సుదీర్ఘంగా వ్యాఖ్యానించారు.
మాలలను కాపాడుకుందాం-చంద్రబాబును సీఎం చేద్దాం.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సభలో ప్రసంగిస్తూ.. తెలుగుదేశం పార్టీ హయంలో మాలల కోసం చేసిన కార్యక్రమాలు, పథకాలు, జీవోల గురించి వివరించారు. అనంతరం జగన్ ప్రభుత్వం వచ్చాక..రాష్ట్రంలో మాలలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను తెలియజేస్తూ.. వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లగా జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే.. కులసమీకరణ జరిగి, అన్ని కులాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని కులాల్లో తెలుగుదేశం పార్టీని పటిష్ఠపరిచి.. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని నక్కా ఆనంద్ గుర్తు చేశారు.
''రాష్ట్ర జనాభాలో మాలలు 20శాతం ఉన్నారు. అంటే దాదాపు 80 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా ఉన్న మాలలు.. ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఘోరమైన దాడులకు, దౌర్జన్యాలకు బలవుతున్నారు. గత ఎన్నికల్లో దళితులంతా జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేసి దగా పడ్డారు. కానీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే మాల, మాదిగలకు గుర్తింపు లభించింది. ఎస్సీల్లో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి.. మాలలను, మాదిగలనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుందాం.''- నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
జగన్ రెడ్డికి చెక్ పెట్టాల్సింది మాలలే.. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే (మాలలే) చెక్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొన్ని వర్గాల ఓట్లు తనకే పడతాయని ఇప్పటికీ జగన్ రెడ్డి ధైర్యమని, ఆ ధైర్యంతోనే అరాచకాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే.. దళిత మంత్రులు, నేతలు మాట్లాడకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం అండతోనే ఎస్సీలు శిరోముండనాలు, హత్యలు, చిత్రహింసలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మంత్రులు జగన్ రెడ్డిని నిలదీస్తేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందన్నారు.
జగన్‌ను నమ్మితే.. గోదాట్లో దూకాల్సిందే.. మరోసారి జగన్ రెడ్డిని నమ్మితే.. అంతా కలిసి గోదాట్లో దూకటమేనని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని వ్యాఖ్యానించారు. మాలలంతా ఐక్యంగా ఈసారి జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా దళితులపై అరాచకాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే మాలల పంతం కావాలని నిర్దేశించారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేసుకోవడమే మనందరి లక్ష్యమని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరుతాం. గత ఎన్నికల్లో జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి అన్ని విధాలా మేము మోసపోయాం. ఇక నుంచి చంద్రబాబుకు మాల సామాజికవర్గం ఓ సైన్యంలా పని చేస్తుంది. జనాభా థామాషా ప్రకారం మాలలకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రబాబు ఇచ్చాడు-జగన్ రెడ్డి అన్యాయం చేశాడు. జగన్.. దళితుల మేనమామ కాదు కంసమామ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేస్తాం.. మాలలను రక్షించుకుంటాం.- 175 నియోజకవర్గాల టీడీపీ మాల నాయకులు