Nadendla Manohar Comments on CM : సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న బిడ్డగా ముద్రపడిన జగన్ రెడ్డిని ఏ కుటుంబం తమ బిడ్డగా ఒప్పుకోదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని పదేపదే మీ బిడ్డ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం ఆపాలని అన్నారు. మాండౌస్ తుపాను పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సరిగా అందించలేదని విమర్శించారు.
పండించిన ధాన్యం కొనండని రైతులు ప్రశ్నిస్తే, వారిని అక్కడికక్కడే వీధి రౌడీల మాదిరి అరెస్టు చేయించిన పాలకుల దాష్టీకాన్ని రైతులు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే, మళ్లీ అవే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కడం ఏమిటి..? అని నిలదీశారు. నాలుగేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.54 వేల సాయం అందించామని చెబుతున్న ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో వారిని మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.
నాలుగేళ్లలో రైతులకు ఈ ప్రభుత్వం ద్వారా అందింది కేవలం రూ.26 వేలు మాత్రమేనని.. దీనికోసం ఇంతటి ఖర్చులెందుకు..? అని ప్రశ్నించారు. 28 కిలోమీటర్ల దూరం ఉన్న తాడేపల్లి నుంచి తెనాలికి కనీసం రోడ్డు మార్గం ద్వారా వెళ్లని ముఖ్యమంత్రికి.. తన పాలనలో గుంతలు పడి ఉన్న రోడ్లను చూసే తీరిక లేదన్నారు. రూ.6,300 కోట్ల అవినీతికి మూలమైన రైతు భరోసా కేంద్రాల గురించి ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారని.. మరి అంత ఖర్చు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగడం లేదని అన్నారు.
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు ఉన్న జగన్ రెడ్డి ఇప్పుడు క్లాస్ వార్ అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. తెనాలి సభ కోసం 450 ఆర్టీసీ బస్సులు ఉపయోగించారని.. ప్రైవేటు పాఠశాలల బస్సులను వదల్లేదని అన్నారు. వారం రోజుల క్రితమే వాలంటీర్లకు, డ్వాక్రా సంఘాలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారని.. సీఎం సభలో చప్పట్లు ఎప్పుడు కొట్టాలి..? ఈలలు ఎప్పుడు వేయాలో కూడా శిక్షణ ఇచ్చి సభకు తీసుకెళ్లారని మనోహర్ ఆరోపించారు.
లక్ష్యాలు పెట్టి, బెదిరించి జనాన్ని తీసుకొచ్చారని... తెనాలిలో విద్యుత్తు సరఫరా నిలిపివేసి, ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడేలా చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తే కొత్త రోడ్లు వేస్తారనే ఆశ జనంలో ఉండేదని.. ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరగడంతో ఆ ఆశ పోయిందని మనోహర్ ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: