CM Jagan Fires on Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇటీవల సమావేశాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి పలు విమర్శలు చేయడంపై.. సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనను కలవాలని కోటంరెడ్డిని ఆదేశించడంతో.. సీఎం జగన్‌ను కలిసి.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తున్నారు. కోటంరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా పార్టీ రీజినల్ ఇన్చార్జి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
సీఎంవో నుంచి పిలుపు రావడంతో నెల్లూరు రూరల్‌లో ముందుగా నిర్దేశించిన వివిధ కార్యక్రమాలను రద్దు చేసుకుని కోటంరెడ్డి తాడేపల్లికి తరలివచ్చారు. నెల్లూరు గ్రామీణంలో 2700 పింఛన్లు తొలగించడంపై కోటంరెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి రావత్పైనా పలు విమర్శలు చేశారు. రోడ్లు సరిగాలేవని పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణం నిధులు కొరత ఉందని, మురుగు కాలువలు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో సీఎంకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అనంతరం సీఎంతో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇప్పటికీ అధికారుల నుంచి సహకారం లేదన్న మాటకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై నేను ఎక్కడా విమర్శలు చేయలేదు... కేవలం ప్రజా సమస్యల పోరాటంపై మాత్రమే మాట్లాడాను. సమస్యల పరిష్కారంలో అధికారుల నుంచి సహకారం లేదన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఆ సమస్యను సరిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించిన అంతర్గత సమావేశం వివరాలు మాత్రం వెల్లడించలేను. భవిష్యత్తులోనూ తన పంథా మారదని స్పష్టం చేశా. -కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: