Illegal soil mining in state: ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్టపడటం లేదు. గుట్టలను గుల్లచేసి మట్టి తరలించడంతో ఆగకుండా.. భూమిని చదును చేసి ఆక్రమించి.. మామిడి మొక్కలు నాటాడు.. స్థానిక వైసీపీ నేత. జాతీయ హరిత ట్రైబ్యూనల్ ఆదేశాలను తుంగలోతొక్కి.. అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. కొత్తూరు తాడేపల్లిలో పగలేకాకుండా.. రాత్రీ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత నెల 20న అక్రమ క్వారీ ప్రాంతాలను.. పరిశీలించిన సంయుక్త కమిటీ పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా మమఅనిపించింది.కొన్నిప్రాంతాల్నిఅసలుపట్టించుకోలేదు. మరోవైపు గనుల శాఖ ఏడీ రవికాంత్ సమర్పించిన నివేదికలో కేవలం పట్టాభూముల్లో తవ్వకాలపై మాత్రమే ఉంది. ఈ విషయంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు మళ్లీ ఫిర్యాదులు వెళ్లాయి.
కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిశీలన.. గత నెల 20న విజయవాడ సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలకు.. కొందరు అధికారులు హాజరే కాలేదు. కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిశీలన చేశారు. పోలవరం కాలువ గట్లు తవ్వేస్తున్నారనే.. ఆరోపణల జోలికెళ్లలేదు. పాతపాడు అటవీభూములు, పి నైనవరం ప్రాంతంలో తవ్వకాలు.. జి.కొండూరు మండలంలోని వెలగలేరు ప్రాంతం, గుట్ట తవ్వకాలు తదితర ప్రాంతాలను.. పరిశీలించ లేదు. వెలగలేరు సమీపంలో అటవీ భూములను ఆనుకొని.. 30 ఎకరాల పట్టాభూముల్లో తవ్వకాలు జరిగాయి. దీనికి ఆనుకొని ఉన్న రిజర్వు ఫారెస్టులో.. భూమిని చదును చేసి ఏకంగా మామిడి మొక్కలు నాటారు.
సమీపంలోని అసైన్డ్ భూములలోనూ తవ్వకాలు జరిగాయి. వేమవరం గ్రామం సమీపంలోనూ అటవీభూముల సరిహద్దులు ఆనుకొని తవ్వకాలు జరిపారు. పాతపాడు గ్రామంలో.. వీఎమ్‌సీ చెత్త డంపింగ్ యార్డు వెనుక వైపు రిజర్వు ఫారెస్టుకు సరిహద్దుగా తవ్వారు. ఇక్కడ సరిహద్దు రాళ్లను సైతం తొలగించి రిజర్వు ఫారెస్టులో ఒక బాటను ఏర్పాటు చేశారు. గనుల శాఖ ఏడీ తయారు చేసిన.. తనిఖీ నివేదికలో నోటీసులు ఇచ్చిన వ్యక్తులందరూ వైసీపీకు చెందిన వారే కావడం విశేషం. ప్రస్తుతం ఈ గ్రామాల్లోనూ అధికార పార్టీ నాయకులే తవ్వకాలు జరిపారు.
పోలవరం ఊసేలేదు.. ఎన్టీఆర్‌కు సబ్ కలెక్టర్‌గా అదితి సింగ్ కొత్తగా వచ్చారు. ఇతర అధికారులు ఆమెను పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటవీ, జలవనరుల అధికారులు మాత్రం.. తమ భూముల్లో అసలు తవ్వకాలే లేవని చెప్పడంతో విచారణ కమిటీ ఆ భూములను పరిశీలించలేదు. బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణం, జి.కొండూరు మండలాల పరిధిలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. పోలవరం కాలువ గట్లపై ప్రతి 100 మీటర్లుకు ఒక రీచ్ చొప్పున తవ్వకాలు జరుపుతున్నారు. 2020-22 మధ్య ఇచ్చిన అనుమతులకు సంబంధించి మిగులు మట్టిని నిర్ణీత గడువులోగా.. తవ్వుకోవాలని.. జలవనరు శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు ఉత్తర్వులు చూపుతున్నారు. అధికారులు మాత్రం తామెరికీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తేల్చిచెప్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో.. ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మళ్లీ పరిశీలించనుంది.