kidnap drama for wife in Rangareddy : భార్య కాపురానికి రాలేదని ఆగ్రహించిన భర్త.. బావమరిది, అతని భార్యను అపహరించాడు. ఆదిభట్ల పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ముడావత్ జగ్య, దేవి దంపతుల కుమార్తె విజయ(28)కు నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన పెయింటర్ కేతావత్ శంకర్‌తో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. నాదర్‌గుల్‌లో నివసిస్తున్న వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విజయ పుట్టింటికి, శంకర్ లింగాలకు వెళ్లిపోయారు.
ఈ నెల 5న శంకర్ కొందరితో వచ్చి అత్తగారింటిపై దాడి చేయడంతో విజయ తండ్రి జగ్య తలకు గాయమైంది. మంగళవారం ఇంట్లో ఉన్న వాళ్లందరినీ కిడ్నాప్ చేయడానికి లింగాల నుంచి శంకర్ రెండు తుఫాన్ వాహనాల్లో బయల్దేరగా.. విషయం తెలిసిన విజయ తండ్రి జగ్యతో కలిసి ఆదిభట్ల ఠాణాకు వెళ్లి సమాచారం ఇచ్చింది. దీంతో శంకర్ ఆ ప్లాన్ మార్చుకొని.. తన భార్యను కాకుండా కూలి పనికి వెళ్లిన బావమరిది కృష్ణ, అతని భార్య పద్మను కిడ్నాప్ చేసి, లింగాలకు తీసుకువెళ్లాడు. భార్యకు ఫోన్ చేసి తన వద్దకు రావాలని బెదిరించాడు.
"5వ తేదీన నా భర్త దాడి చేశాడని ఠాణాలో ఫిర్యాదు చేశాం. మంగళవారం మళ్లీ వస్తున్నారని తెలిసి మధ్యాహ్నం నేను, మా నాన్న ఠాణాకు వెళ్లి విషయం చెప్పాం. పోలీసులు పట్టించుకోలేదు." - విజయ
అపహరణకు గురైన కృష్ణ, పద్మ దంపతులకు అపాయం లేదని ఆదిభట్ల పోలీసులు కుటుంబ సభ్యులకు వివరించారు. వారితో ఫోన్‌లో మాట్లాడించారు. నిందితులను లింగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి :