High Court : హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మాణాలు చేస్తున్నట్లు తేలితే విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ను జైలుకు పంపుతామని హైకోర్టు హెచ్చరించింది. మైదానం ఆక్రమణలకు గురి కాకుండా రక్షిస్తామనీ వీఎంసీ కమిషనర్ గతంలో కోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేసింది. ఆ హామీని ఉల్లంఘించినట్లు, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు నిర్థారణ అయితే జైలుకు పంపుతామంది. కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉంటాయిలే అని ముందుగా భావించడం సరి కాదని అధికారులకు హితవు పలికింది. కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లు లేదా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్.రఘు నందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
స్వరాజ్య మైదాన్‌కు చెందిన భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ముక్కామల నాగ భూషణం వీధిలో పలు ఆక్రమణలు జరిగినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ మాజీ శాసన సభ్యులు అడుసుమిల్లి జయప్రకాష్ 2015 సెప్టెంబర్‌లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. 21.36 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2016 జులైలో వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు స్వరాజ్య మైదాన్ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని, ఆక్రమణలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. మాస్టర్ ప్లాన్, జోనరల్ రెగ్యులేషన్, మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వీఎంసీ కమిషనర్ ఇచ్చిన హామీని నమోదు చేసింది.
హైకోర్టులో తాజాగా పిటీషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంఆర్‌కే చక్రవర్తి వాదనలు వినిపించారు. జోనింగ్ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. ప్రతి నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఊపిరితిత్తులు లాంటి మైదానాలు అవసరం అన్నారు. విజయవాడ నగరానికి స్వరాజ్య మైదానం కీలకం అన్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, మైదానంలో ఎలాంటి నిర్మాణాలు వద్దని హైకోర్టు 2016 జులై 4 న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నాయని అన్నారు. ఆ ఉత్తర్వులను లెక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని అన్నారు. మైదానాన్ని రక్షింస్తామని వీఎంసీ కమిషనర్ కోర్టుకు గతంలో హామీ ఇచ్చారని అన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గత హామీని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వీఎంసీ కమిషనర్‌ను జైలుకు పంపుతామని వ్యాఖ్యానించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి