ETV Bharat / state

భాష నశిస్తే జాతి మనుగడే శూన్యం: బుద్ధప్రసాద్‌

World Telugu Congresses In VIjayawada: స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం..’ అనే నినాదంతో ‘ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలను’ విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. మారుతున్న సమాజంలో రచయితల పాత్ర అనే అంశంపై ఈ సభల్లో ప్రధానంగా చర్చించనున్నాం’’ అని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు.

Buddha Prasad
బుద్ధప్రసాద్‌
author img

By

Published : Dec 22, 2022, 9:52 AM IST

World Telugu Congresses In VIjayawada: సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. మాతృభాష, సంస్కృతులకు ముప్పు వాటిల్లుతోంది. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన కీలక సమయం ఇది. మన భాషను రక్షించుకోవడం ఎలా అనే దానిపై ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలి. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు. కానీ.. ఆ నెపంతో తెలుగు అక్షరాలే నేరమనే జాతి తయారవడం బాధాకరం. ఇటీవల విజయవాడలోని కొన్ని పాఠశాలల్లో అధికారులు పరిశీలించగా.. తొమ్మిదో తరగతి విద్యార్థులు వారి పేర్లను తెలుగులో రాయలేని పరిస్థితి కనిపించింది. భాష నశిస్తే.. జాతి నశించిపోతుందనే వాస్తవాన్ని తెలుగువారు గుర్తుంచుకోవాలి. ఆర్థిక అవసరాల కోసం ఆలోచిస్తున్నారే తప్ప.. మన వారసత్వాన్ని నిలుపుకోవాలనే ఆలోచన ఉండడం లేదు. అందుకే.. స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం..’ అనే నినాదంతో ‘ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలను’ విజయవాడలో నిర్వహిస్తున్నాం. మారుతున్న సమాజంలో రచయితల పాత్ర అనే అంశంపై ఈ సభల్లో ప్రధానంగా చర్చించనున్నాం’’ అని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలో మహాసభలు జరగనున్నాయి..

మాతృ భాష కోసమే ఏర్పడిన రాష్ట్రం మనది: భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని కోరింది తెలుగు వాళ్లు మాత్రమే. తెలుగులో చదువుకుంటాం, తెలుగులో పరిపాలించుకుంటామంటూ.. 1913లో బాపట్లలో ఆరంభమైన ఉద్యమం 40 ఏళ్ల పోరాటం తర్వాత ఫలించింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రెండు అంశాలను మరచిపోవడం అత్యంత బాధాకరం. విద్యావిధానంలో తెలుగుకు వెలుగు లేదు. పరిపాలనలోనూ మాతృభాష అంతంతమాత్రంగానే మారింది. రాష్ట్రంలోని ఏ వాణిజ్య సంస్థ పేర్లూ తెలుగులో కనిపించడం లేదు.

విలువలు నేర్పించే తెలుగు బోధన ఏదీ: తెలుగు వారి వ్యక్తిత్వం మాతృభాష ద్వారానే వికసిస్తుంది. పరభాష ద్వారా వికసించదనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. విద్యావిధానంలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారు. తెలుగును ఒక అంశంగా బోధిస్తామన్నారు. అయితే.. ఆ బోధన ఎలా జరుగుతోందో అందరం చూస్తున్నాం. కనీసం పేర్లు కూడా తెలుగులో రాయలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. మేం చదువుకునేటప్పుడు శతక పద్యాలు వల్లె వేయించేవారు. అవే ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగేందుకు తోడ్పడ్డాయి. ఏ సందర్భంలోనూ తప్పు చేయకూడదనే విలువలను వేమన, సుమతీ శతకాలు నేర్పించేవి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కో పద్యం గుర్తొచ్చి తప్పు చేయకుండా ఉండేలా చేసేవి. కానీ.. ఈ రోజు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ మన భాష, సంస్కృతితో సంబంధం లేని ఆంగ్ల పద్యాలను నేర్పిస్తున్నారు. తెలుగు పద్యం, పాట నేర్పించే పరిస్థితి లేదు. ఈ విధానం మన పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నది వాస్తవం.

భాషను పోషించే వాళ్లే నిలిచిపోతారు: భాషను, సంస్కృతిని పరిరక్షించే పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. వెయ్యేళ్ల కిందటి రాజరాజనరేంద్రుడి నుంచి పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్‌ వరకూ ఇలా ఎంతోమందిని తెలుగు వాళ్లు నేటికీ గుర్తుంచుకోవడానికి ఇదే కారణం. తెలుగు భాషలో మొట్టమొదటి కావ్యరచనకు రాజరాజనరేంద్రుడే ఆద్యుడు. అందుకే.. ఈ సభల ప్రాంగణానికి ఆయన పేరును పెట్టాం. పి.వి.నరసింహారావు మాతృభాష ఉన్నతి కోసం ఎంతో చేశారు. అధికార భాషా చట్టం తెచ్చి, తెలుగు అకాడమీ పెట్టి పాఠ్య గ్రంథాలను రూపొందించి.. బోధనా భాషగా మార్చింది ఆయనే. ఒక వేదికకు పీవీ పేరు పెట్టాం. ప్రపంచంలో తెలుగు భాష, జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్‌. తెలుగు వారి ఆత్మగౌరవానికి ఆయన ప్రతీక. తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తెలుగుజాతి వైభవాన్ని చాటిన ప్రముఖుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై పెట్టి.. భావితరాలకు వారి గురించి తెలియజేశారు. అందుకే మరో వేదికకు ఆయన పేరు పెట్టాం. వీళ్లందరూ భాషను, సాహిత్యాన్ని, కళలను పోషించిన వారే. ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ విద్యా సంస్థలు తల్లిదండ్రుల మనస్తత్వాన్ని మార్చేశాయి. ‘ఆంగ్లంతోనే అన్నీ’ అనేది వారి మనసుల్లో బలంగా నాటాయి. చివరికి నేటి ప్రజా ప్రభుత్వాలు కూడా వాటి ప్రభావంలో పడిపోతున్నాయి. వాస్తవంగా అయితే.. తొలుత పిల్లలకు మాతృభాషను నేర్పించాలి. ఆ తర్వాతే ఇతర భాషలను నేర్పిస్తే.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన దగ్గరే పొరుగు భాషల వ్యామోహం ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో.. కేరళలో మాతృభాషలకు ఇచ్చే ప్రాధాన్యం వేరు. మాతృభాషలో చదువుకునే వాళ్లకు ఉద్యోగాల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇతర దేశాల్లోని వారికే ఎక్కువ ఆసక్తి: మన తెలుగు రాష్ట్రాల్లో కంటే అమెరికా లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాల్లోనే మాతృభాషపై ఆసక్తి ఎక్కువ ఉంది. అక్కడి చిన్నారులు పద్యాలు సైతం రాసే స్థాయిలో భాషపై పట్టు సాధిస్తున్నారు. వందల ఏళ్ల కిందట ఇక్కడి నుంచి మారిషస్‌, మలేషియా లాంటి దేశాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు కూడా మాతృభాష, సంస్కృతులను ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. తెలుగు ద్వారానే జాతిని కాపాడుకోగలమనే భావన వారిలో ఎక్కువ ఉంది. కానీ.. తెలుగు గడ్డపై ఉన్న మన పాలకులు, ప్రజలకు ఆ భావన లేకపోవడమే బాధాకరం.

కేంద్ర విద్యావిధానం అమలు చేయాలి: ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని తాజాగా కేంద్రం నిర్దేశించింది. త్వరలో అది అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తాయా.. లేదా అనేదే సందేహం. కేంద్రం సూచించినట్లు మన రాష్ట్రంలో అమలు జరిగితే.. మళ్లీ తెలుగుకు వెలుగు వస్తుంది. మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన జరగకపోతే.. ఎన్నో భాషలు కనుమరుగైపోతాయనే ఆందోళనతోనే కేంద్రం ఈ విధానం ప్రవేశపెట్టింది.

భాష నశిస్తే జాతి మనుగడే శూన్యం: బుద్ధప్రసాద్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.