FAPTO Movement Activity From June 5th : విద్యారంగ సంస్కరణ కారణంగా ఎదురవుతున్న సమస్యలు, అధికారుల వైఖరితో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ ఐదో తేదీ నుంచి సెప్టెంబరు ఒకటవ తేదీ వరకు పలు పద్ధతుల్లో ఉద్యమిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కార్యాచరణ ప్రకటించింది. జీఓ 117ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు, వేలాది ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడంతో పాటు పాఠశాలల విలీనం జరుగుతుందని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పేర్కొన్నారు.
ఎనిమిది ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ : ఇతర ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ప్రక్రియకు భిన్నంగా ఉపాధ్యాయుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని, 2,500 రూపాయలు ఇచ్చే పదోన్నతి, ఒక ఇంక్రిమెంట్ పేరుతో ఇచ్చే పదోన్నతులు నష్టదాయమని ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరున్నర వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లించడంలో తాత్సారం చేయడం ఆర్ధికంగా నష్టం చేకూరుతోందన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, డీఏతో పాటు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన హామీ మేరకు పాత ఫించను విధానం పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిది ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వివిధ పద్ధతుల్లో ధర్నాలు : ఇందులో భాగంగా జూన్ ఐదో తేదీ నుంచి తొమ్మిది వరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతులు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. జూన్ 14 నుంచి 16 వరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, ఎమ్మెల్యేలకు వినతులు, జూన్ 18 నుంచి జులై 9 వరకు ఉమ్మడి జిల్లా వారీగా సదస్సులు, జులై 11న సమస్యల పరిష్కారానికి ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇచ్చి, జులై 26 నుంచి మూడు రోజుల పాటు మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆగస్టు 5న తాలూకా స్థాయిలో 12 గంటల ధర్నా, ఆగస్టు 12న జిల్లా స్థాయిలో ర్యాలీలు, 24 గంటల ధర్నా, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బైక్ జాతా చేస్తామని ఆయన అన్నారు.
"అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన హామీకి భిన్నంగా జీపీఎన్ అనే ఉన్నత వర్గాలకు ఉపయోగపడే విధానాన్ని తీసుకువచ్చారు. అందుకే ఓపీఎస్‌ను ఆమలు చేయాలనే డిమాండ్‌తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పాత బకాయిలను చెల్లించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. విద్యా రంగానికి సంభందించి జీఓ నంబర్ 117 రద్దు చేయాలని కోరుతున్నాము."- ఎన్. వెంకటేశ్వర్లు, ఫ్యాప్టో ఛైర్మన్
ఇవీ చదవండి