Protest by RTC Employees Family Members: ఆర్టీసీలో పనిచేస్తూ 2016కు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత కల్గిన వారందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆర్టీసీ హౌస్ ముందు మండుటెండలో ధర్నాకు దిగారు.
2016 తర్వాత ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మాత్రమే ఇటీవల ఉద్యోగాలిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం.. తమను పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. 2016 ముందు కాలంలో విధినిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన తమకూ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఫలితంగా తాము కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు రోదించారు. 2016 ముందు చనిపోయిన 270 ఉద్యోగుల కుటుంబాలకూ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటల పాటు ఎండలో నిరసన తెలిపారు.
తమతో పాటు పెట్రోల్ బాటిల్లు తీసుకుని వచ్చిన బాధితులు.. ఉద్యోగాలు ఇవ్వకపోతే తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. ఉద్యోగాలు లేక తాము అష్టకష్టాలు పడుతున్నామని అధికారుల ముందు కన్నీరు మున్నీరై బాధితులు ఆవేదన వ్యక్తం చేసినా సానుకూల హామీ రాలేదు.
"మా వారు 2015లో విద్యాధరపురం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోయారు. అయితే అప్పుడు అప్లికేషన్ పెట్టుకోమని అన్నారు. వయసు సరిపోతది అన్నారు. కానీ నాలుగు నెలల తరువాత పిలిచి.. నీకు వయసు సరిపోదమ్మా అని పిల్లలు ఎవరైనా ఉంటే పెట్టుకోండి అన్నారు. కానీ అప్పటికి పిల్లలకి 18 ఏళ్ల లోపు ఉండేది. తరువాత బాబుకి వయసు నిండిందని ఉద్యోగానికి పెట్టుకున్నాం. అప్లికేషన్ తీసుకున్నారు. లిస్ట్‌లో కూడా పేరు ఉంది. కానీ ఇప్పుడేమో 2015కి ముందు వారివి క్లియర్ అయిపోయాయి.. మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి మా అందరి ఉద్యోగాలు ఏమయ్యాయి". - బాధితురాలు
"2014లో నా భర్త చనిపోయాడు. కానీ అప్పటికి నా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఓపెన్‌లో టెన్త్ రాసుకొని రావచ్చు అన్నారు. నేను టెన్త్ రాసిన తరువాత నా అప్లికేషన్ ఇచ్చాను. మీకు ఫోన్ చేస్తాం అని చెప్పారు. కానీ అప్పటి నుంచి మాకు ఏం రాలేదు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం". - బాధితురాలు
"మా నాన్న గారు 2014లో చనిపోయారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకూ ఇస్తాం అన్నారు. ఇప్పుడేమో ఇవ్వడం అవ్వదని చాలా బాధ పెడుతున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఎండీ గారు వచ్చి హామీ ఇస్తే చాలు". - బాధితురాలు
ఇవీ చదవండి: