ELECTRICITY SMART METERS FOR HOUSE: ముందస్తుగా రీఛార్జ్ చేసుకుంటేనే ప్రీపెయిడ్ సెల్‌ఫోన్ సేవలు అందుతాయి. ఏదైనా కారణంతో మరచిపోతే ఇక అంతే క్షణాల్లో సేవలు నిలిచిపోతాయి. మళ్లీ నిర్దేశిత మొత్తం చెల్లించాకే సేవలు అందుతాయి. మనం ఇంట్లో వాడే విద్యుత్‌కూ ఇకపై ఇదే విధానం వర్తించనుంది. దీనికోసం ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల మనం ఇళ్లలో వాడే విద్యుత్‌కు ఛార్జీలను ముందుగానే చెల్లించాలి. మొదటిదశలో 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు పెట్టడానికి ఇప్పటికే టెండర్లు పిలిచాయి. దశలవారీగా మిగిలిన 1.43 కోట్ల విద్యుత్ కనెక్షన్లకూ స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయనున్నాయి.
విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం స్మార్ట్‌గా 4 వేల 486 కోట్ల 93 లక్షల రూపాయల భారాన్ని మోపుతోంది. మూడు డిస్కంల పరిధిలో స్మార్ట్‌మీటర్ల కొనుగోలు, నిర్వహణ, ఫీడర్ల విభజన పనులకు 8 వేల 927 కోట్ల 36 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం 4 వేల 440 కోట్ల43 లక్షల రూపాయలు గ్రాంటురూపేణా అందిస్తుంది. మొదటిదశలో 27.68 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లతో పాటు.. 25 కేవీఏ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న 2.92 లక్షల పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, 14 వేల 33, 11 కేవీ ఫీడర్లకు స్మార్ట్‌మీటర్లను డిస్కంలు ఏర్పాటు చేస్తాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ ప్రొవైడర్ కింద స్మార్ట్‌మీటర్ల నుంచి రీడింగ్ నమోదు కోసం మూడు డిస్కంలు 2 వేల 201 కోట్ల 24 లక్షల రూపాయలతో వేర్వేరు టెండర్లు పిలిచాయి. వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు కోసం 6 వేల725 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన పనులకు జిల్లాల వారీగా 9 పనులుగా విభజించి టెండరు ప్రకటన జారీచేశాయి. ఫీడర్ల విభజన పనులకు 2023 జనవరి 6వ తేదీతో గడువు ముగియనుంది. ఏఎంఐఎస్‌పీ పనులకు జనవరి 17లోగా గుత్తేదారు సంస్థలు బిడ్లు దాఖలు చేయాలి. ఈ భారం మొత్తం వినియోగదారుల నుంచే పరోక్షంగా విద్యుత్ ఛార్జీల్లో కలిపి డిస్కంలు వసూలు చేస్తాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు టోటెక్స్ విధానంలో డిస్కంలు టెండర్లు పిలిచాయి. మూడు డిస్కంల పరిధిలో మొత్తం 30.74 లక్షల స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయనున్నాయి. దీనికోసం సీపీడీసీఎల్ 783 కోట్లు, ఈపీడీసీఎల్ 628.24 కోట్లు, ఎస్‌పీడీసీఎల్ 790 కోట్లతో పనులను నిర్వహించనున్నాయి.
వ్యవసాయ విద్యుత్‌కు ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు, లోడ్ ఎక్కువగా ఉన్న ఫీడర్లను విభజించే పనులకు 6 వేల 725 కోట్ల 72 లక్షల రూపాయలతో డిస్కంలు పనులు నిర్వహించనున్నాయి. డిస్కం పరిధిలో చేపట్టనున్న పనులకు ఒకే టెండరు కాకుండా.. దాదాపు ప్రతి జిల్లాకు డిస్కంలు వేర్వేరుగా టెండర్లు పిలిచాయి. పనులు వేగంగా పూర్తిచేయడానికి వీలుగా ఎక్కువమంది గుత్తేదారులకు అప్పగించాలనే ఇలా పిలిచామని అధికారులు చెబుతున్నా.. స్థానిక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్ల ఆధారంగా వారికి ప్రయోజనం కలిగించేలా పనులను విభజించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీపీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి 555 కోట్లు, ప్రకాశం జిల్లాలో 544 కోట్ల రూపాయలతో పనుల నిర్వహణకు వేర్వేరు టెండర్లను పిలిచింది. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 624.27 కోట్లు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పనులకు 442.25 కోట్లతో వేర్వేరుగా.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్‌లైన్ల ఏర్పాటుకు 986.58 కోట్లతో టెండర్లను పిలిచింది. ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల్లో 3 వేల 564 కోట్లతో పనులను నిర్వహిస్తోంది. నెల్లూరులో 505 కోట్లు, చిత్తూరులో వెయ్యి 29 కోట్లు, అనంతపురంలో 929 కోట్లతో పనులకు టెండర్లు పిలిచింది. వైయస్‌ఆర్, కర్నూలు జిల్లాలకు కలిపి వెయ్యి41 కోట్లతో పనులను నిర్వహిస్తోంది. రెండు డిస్కంల పరిధిలో నిర్వహించే పనుల విలువ కంటే 411.90 కోట్లు అధికంగా పనులు ప్రతిపాదించింది.
ఇవీ చదవండి