Durga Malleswara Swami : విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి నౌక విహారాన్ని చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించారు. ఆది దంపతులు కృష్ణవేణిలో నదీ విహారం చేశారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రదోష కాలంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి.. మూడుసార్లు ఎంతో నయన మనోహరంగా జలవిహారం సాగించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి ఉత్సవ మూర్తులను వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజాదికాల అనంతరం.. కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన పంటు వద్దకు తీసుకువచ్చారు. పంటుపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పారాయణ, రుద్ర పారాయణ, లలిత సహస్ర నామాల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్న విద్యుత్తు దీపకాంతుల మధ్య ఆదిదంపతులు చైత్రమాసంలో దుర్గగుడి చరిత్రలోనే తొలిసారి జలవిహారం సాగించారు.
గత మూడేళ్లుగా దసరా ఉత్సవాల సమయంలో కరోనా, వరదల కారణంగా నిర్వహించలేదు. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వాముల నౌకావిహారాన్ని చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించారు. ప్రతి ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో నౌకావిహారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఉత్సవ మూర్తులను కొండపై నుంచి తీసుకుని వచ్చారు. ఆరు గంటలకు ప్రారంభమైన నౌకావిహారం గంటకుపైగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర పాలక మండలి సభ్యులు, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు పంటుపై ఆశీనులయ్యారు.
ఉత్తరాయణంలో వసంత రుతువు, దక్షిణాయణంలో శరద్ రుతువు సమయాల్లో దుర్గా అమ్మవారిని ఆరాదించుట శ్రేష్టమని, అందులో భాగంగా ఉత్తరాయణకాలం చైత్రమాసంలో వసంత నవరాత్రులు, అనంతరం శ్రీఅమ్మవారి బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. గంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల "కృష్ణ వేణి నదీ విహారము" ను భక్తులు విశేషంగా తిలకించారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయకర సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాన్ని నిర్వహించారు.
ఘనంగా వసంతోత్సవాలు : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రాకీలాద్రిపై జరిగిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిసాయి. ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహూతి కార్యక్రమం నిర్వహించి.. అర్చకులు శాస్త్రోక్తంగా క్రతువును పూర్తి చేశారు. పూర్ణాహూతి కార్యక్రమంలో ఆలయం ఛైర్మన్, ఈవో, ఆలయాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :