'తుపాను ప్రభావం' ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం - అవస్థలు పడుతున్న రైతన్నలు - Cyclone Michaung in Ntr District
Cyclone Michaung Live Updates in Andhra Pradesh: తీవ్ర తుపాను మిగ్ జాం కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతోంది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రైతన్నలు నీటిలో నానుతున్న వరి పనలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో నష్టపోయామని వాపోతున్నారు. ఇవాళ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో విద్యార్ధులకు కాస్త ఉపశమనం లభించింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 2:29 PM IST
Cyclone Michaung Live Updates in Andhra Pradesh : మిగ్‌జాం తుపాను ప్రభావంతో విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి చెదురుమొదురుగా చినుకులు పడినా రాత్రి నుంచి ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నీటమునిగాయి. నిర్మలా కాన్వెంట్, మొగల్రాజపురం, బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బందరు రోడ్డు, పంట కాలవ,చుట్టుగుంట, కృష్ణలంక, భవానిపురం, మాచవరం తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. రోడ్లు నీటమునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిపోయి వర్షపు నీరు రోడ్లమీదకు చేరింది.
Andhra Pradesh Farmers Crops Damage Due to Heavy Rains : విజయవాడలోని కానూరు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు వచ్చే బందరు రోడ్డులో చాలా చోట్ల నీళ్లు అడుగు లోతులో ప్రవహించడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇవాళ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో విద్యార్ధులకు కాస్త ఉపశమనం లభించింది. కొండచరిలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టినా స్థానికులు అక్కడి నుంచి బయటకొచ్చేందుకు విముఖత చూపారు.
మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి
Heavy Rains in Andhra Pradesh : విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును నిన్న సాయంత్రం నుంచి మూసివేశారు. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మెట్లు, లిఫ్ట్ మార్గాలను వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 15.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనే 25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Cyclone Michaung Tracker : భానునగర్‌లో తప్పిన పెను ప్రమాదం : విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డు భానునగర్‌లో ఈదురు గాలులకు ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. తుపాను ప్రభావంతో బలమైన గాలులకు ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసం కట్టిన పరంజ కూలిపోయింది. ఐరన్ రాడ్లు ఒక్కసారిగా 5 అంతస్తులపై నుంచి పడిపోవడంతో 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక గృహం పూర్తిగా దెబ్బతింది. ఐరన్ రాడ్లు పడిన సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నీటిలో నానుతున్న వరి పనల : కృష్ణా జిల్లా గుడివాడ అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈదురు గాలులకు వరి చేలు నేలకొరిగింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో రైతులు పంటను కాపాడుకోలేకపోతున్నారు. పామర్రు నియోజకవర్గంలో రైతన్నలపై తుపాను పిడుగుపడింది. పామర్రు, మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వరి పైరు నేలకొరిగడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. రైతన్నలు నీటిలో నానుతున్న వరి పనలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. దివిసీమలో రాత్రి నుండి ఎడతెరిపి లేని వర్షాలకు, నాగాయలంక గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.
LIVE UPDATES: కాసేపట్లో తీరం దాటనున్న మిగ్‌జాం - తీరానికి అత్యంత దగ్గరగా కదులుతోన్న తీవ్ర తుపాను
AP Schools Closed Today Due To Cyclone Michaung : రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ దాటికి మైలవరం ప్రాంతం స్థంభించింది. తెల్లవారుజామున మొదలైన కుండపోత వర్షంతో మైలవరం ప్రాంతం నిర్మానుషంగా మారింది. పత్తి పంటల చివరిలో ఈ తుఫాన్ ప్రభావం తమకు నష్టం కలిగిస్తుందని రైతులు వాపోతున్నారు. తుఫాన్ తీవ్రంగా ఉండటంతో పాఠాశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
విరిగిన చెట్లు, అందుబాటులో లేని అధికారులు : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట వర్షానికి తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి ప్రాంత రైతులు అల్లాడిపోతున్నారు. తుఫాను గాలుల కారణంగా మొవ్వ కొడాలి మధ్య చెట్లు విరగడంతో వాహనాలు భారీగా ఆగిపోయాయి. చలిగాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుబాటులో అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆందోళన : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు నేల వాలాయి. నూర్పిడికి సిద్ధంగా ఉన్న పొలాలు నేల వాలటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రం అల్లకల్లోలంగా మారిందని వాతావరణశాఖ స్పష్టం : తీవ్ర తుపాను మిగ్ జాం కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. తీవ్ర తుపానులో కొంత భాగం భూమిపైన మరికొంత సముద్రంలోనూ ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. తీరానికి అత్యంత సమీపం నుంచి తీవ్ర తుపాను కదులుతుండటంతో తుపాను కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. నెల్లూరు తీరానికి 55 కిలోమీటర్లు, బాపట్లకు సమీపంలో తీవ్ర తుపాను మిగ్ జాం కేంద్రీకృతమై ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది.
ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల భారీ స్థాయిలో వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ముంచెత్తింది. ప్రత్యేకించి కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చాలా చోట్ల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో చాలా చోట్ల సముద్రపు నీరు ముందుకు చొచ్చుకు వచ్చినట్టు ఇన్ కాయిస్ సంస్థ తెలియచేసింది.
చిత్తూరు జిల్లాలో తుపాన్ ప్రభావం - తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ