Ex Minister Chinta Mohan Criticism: ఆంధ్రప్రదేశ్ అబద్ధాల ప్రదేశ్‌గా మారిందని.. ఇతర రాష్ట్రాల కంటే అధ్వానస్థితికి చేరిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో రైతులు, మహిళలు రోడ్డెక్కారన్నారు. సీఎం జగన్‌ను అంతా ప్రధాని దత్తపుత్రుడిగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో అమరావతి మొండి గోడలా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం ముందుకు సాగడం లేదని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైందని ధ్వజమెత్తారు. ఆర్థిక అసమానతలు రాష్ట్రంలో పెరిగిపోయాయన్నారు. దేశ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క పూట భోజనం చేయలేని వారు ఉన్నారని.. ఇదేనా జగన్ చెప్పే రాజన్న రాజ్యమా ? అని ప్రశ్నించారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, హాస్టల్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదన్నారు. వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనసభ వేదికగా పాలకులు అబద్ధాలు చెబుతున్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఇప్పుడు చేసింది ఏమీ లేదన్నారు. ప్రధానికి మోదీ దత్తపుత్రుడని.. ఆయన చెప్పిందే సీఎం చేస్తారన్నారు. ప్రజల, ప్రభుత్వ ధనాన్ని అదానీకి దోచిపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ రాష్ట్రంగా మార్చేస్తున్నారని.. అదానీని పెంచి పోషించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా మారిందన్నారు. చదువులు చెప్పే గురువులను బంట్రోతులుగా మార్చిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంతృప్తిగా పని చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నాశనమైందన్నారు. ఒక్క ఛాన్స్ అంటే జగన్‌కి ప్రజలు పట్టం కట్టారని.. ఇప్పుడు సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పూర్వ వైభవం రావడం ఖాయమని.. వైకాపా ఖాళీ అయిపోతుందని ఆయన అన్నారు.
"వైకాపా ఎమ్మెల్యేలు జిల్లాల్లో దోచుకుంటున్నారు. మంత్రులు పోటీ పడి మరీ డబ్బు తింటున్నారు. మంత్రులకు డబ్బు తప్ప వేరే మాట, ఆలోచనే లేదు. కాంగ్రెస్ ఇస్తానన్న ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ఆపేశారు". -చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి
ఇవీ చదవండి: