BV RAGHAVULU : బీజేపీను వ్యతిరేకించే పార్టీలతో భవిష్యత్తులో కలిసి పని చేస్తామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవి రాఘవులు తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పోరాటాలపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకు తాకట్టుపెట్టిందని రాఘవులు విమర్శించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ నిర్భందం, ప్రజలకు నష్టం చేసే విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నారు..
రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ నూతన కార్యాలయం: సీపీఎం పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా పని చేస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బేబి పేర్కొన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని సీపీఎం రాష్ట్ర కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని సీపీఎం సీనియర్ నాయకులు పి. మధు ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని.. అందుకే తమని బలహీనపరచాలని అధికార పార్టీలు భావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. త్రిపురలో ఎన్నికల వేళ బీజేపీ తమ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతుందని విమర్శించారు.
ఇవీ చదవండి: