Congress Satyagraha initiative: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంకల్ప సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆ పిలుపులో భాగంగా విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వద్ద గాంధీ విగ్రహం ముందు గిడుగు రుద్రరాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రుద్రరాజు చేపట్టిన నిరసనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని ప్రశ్నించిన వారిని చట్టసభల నుంచి అనర్హత వేటు వేసి బయటికి గెంటడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మనం గమనిస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం అనేది చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉంది. ప్రతిపక్షాల అందర్ని కూడా భయపెట్టడం లాంటివి చేస్తున్న పరిస్థితి.. ఈడీ ద్వారానో సీబీఐ ద్వారానో అందర్ని కూడా భయభ్రాంతులకు గురి చేయడం మనం చూస్తున్నాం.. ప్రధానంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈడీ పేరుతో సీబీఐ పేరుతో గతంలో బాగా ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.. ఏక్కడా ఏమీ దొరకక ఈ రోజు లాలో ఉన్న కొన్ని లొసుగులు తీసుకుని ఇలా చేస్తున్నారు.- గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు
నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలన్నింటినీ ద్వంసం చేశారు.. ప్రజాస్వామ్యానికి పాతర వేశారు.. అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తున్నారు. ఇవాళ అదానీ కుంభకోణం బయట పడింది కాబట్టి వాటిని ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తారో వారందరి నోళ్లు నొక్కడానికి.. ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నారు. మోదీ హఠావో దేశ్‌కీ బచావో అనే నినాదంతో రాబోయే రోజుల్లో మేము అందరం కలసికట్టుగా ముందుకు సాగుతాం బీజేపీని గద్దే దించే వరకూ పోరాడతామని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రకటిస్తున్నాం.- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కర్నూలు జిల్లాలో.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా ప్రవర్తిస్తుందని.. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ వద్దనున్న గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని చూస్తే భయపడుతున్నారని సుధాకర్ బాబు తెలిపారు. రాహుల్ గాంధీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటాలు ఆగవని ఇలా చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: