CM Jagan Tiruvuru Tour Arrangements Updates: 'జగనన్న విద్యా దీవెన' పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ముందుగా ఆయన తిరువూరులో పర్యటించి.. బైపాస్ రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పక్కన గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకొనున్నారు.
1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు: ఈ క్రమంలో అధికారులు, ఎమ్మెల్యేలు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైయ్యారు. దారా పూర్ణయ్య టౌన్ షిప్‌లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలాల నుంచి వేలాది మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకూ సీఎం కాన్వాయ్ కోసం వాహన శ్రేణితో అధికారులు ట్రైల్ రన్ నిర్వహించారు.
రూ. 700 కోట్ల రూపాయలు విడుదల: ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులు మీడియాతో మాట్లాడుతూ..''రేపు తిరువూరులో సీఎం జగన్ 'జగనన్న విద్యా దీవెన' నాల్గవ విడత కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు 11 లక్షల మందికి రూ. 700 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. పేదల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదవాలనేది సీఎం జగన్ ఆలోచన. అందుకే ఆయన ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయం మాత్రం మావైపు ఉంది. రూ.700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో పడనున్నాయి. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల తీరును చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఏపీ తరహాలోనే తమ రాష్ట్రాలలోని పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి.'' అని అన్నారు.
పోలీసుల ఆంక్షలు-వాహనదారులు అవస్థలు: మరోవైపు సీఎం జగన్ తిరువూరులో పర్యటించనున్న నేపథ్యంలో.. పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు వాహనచోదకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నుండి జగదల్‌పూర్ హైవేపై ప్రయాణం చేసే వాహనాలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దారి మళ్లిస్తున్నారు. మైలవరం నుండి ఖమ్మం వెళ్లాల్సి వచ్చే వాహనాలను చీమలపాడు సెంటర్ నుండి వయా గంపలగూడెం, చింతలపాడు, మునుకోళ్ల, మీదుగా కల్లూరు నుండి ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు. దీంతో ఆఫీసులకు, స్కూల్స్‌కి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
సీఎం జగన్ పర్యటన వివరాలు: సీఎం జగన్..ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 10.20గంటలకు తిరువూరులోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ 15 నిమిషాల విరామం తీసుకొని.. 10.35 నుండి 10.45 వరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. 10.45కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.00 గంటలకు సభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు.
అనంతరం 11.00 గంటలకు నుండి 12.30 వరకు జగనన్న విద్యా దీవెన నగదు బదిలీకు సంబంధించిన నిధులను బటన్ నొక్కుతారు. తదుపరి విద్యార్థులు, ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 12.40 గంటలకు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకొని.. 15 నిమిషాలు పాటు పార్టీకి చెందిన స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత 12.55 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయలుదేరుతారు.
తిరువూరులో వర్షం బీభత్సం: మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు విచ్చేస్తున్న క్రమంలో పార్టీ కార్యకర్తలు.. వైసీపీ జెండాలతో, సీఎం జగన్ ఫ్లెక్సీలతో నింపేశారు. సభ వేదికగా ముందు భారీగా క్లాత్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరువూరు పట్టణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం భీభత్సం సృష్టించింది. దీంతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలన్ని పడిపోయి.. బెలూన్లు ఎగిరిపోయాయి. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన క్లాత్ ఒక్కసారిగా ఊడిపోయింది.
ఇవీ చదవండి