Citizens for Democracy Organization Meeting: విజయవాడలో 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ' సంస్థ ఆవిర్భావ సభ జరిగింది. మొఘల్రాజపురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సీఈసీ వి.ఎస్.సంపత్ (Former CEC VS Sampath) పాల్గొన్నారు. అదే విధంగా సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ (Justice G Bhavani Prasad), సంస్థ జనరల్ సెక్రటరీ, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh Kumar), మాజీ సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 'నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలు - ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ' పై పలువురు ప్రసంగాలు చేశారు.
ప్రతిపక్షాలను అణచివేయడం ఏ పార్టీకీ కుదరదు: ప్రజాస్వామ్యం బలహీనపడేందుకు అంతర్గత శత్రువులే కారణమని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు. చరిత్ర నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. అనేక దేశాలకు ఎన్నో పోరాటాల తర్వాతే ఓటుహక్కు వచ్చిందన్న నిమ్మగడ్డ.. దేశంలోని ప్రజలందరూ కోరుకునేది.. సుపరిపాలనే అని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన పన్నుకు జవాబుదారిగా ఉండేదే ప్రభుత్వం అని.. గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను అణచివేయడం ఏ పార్టీకీ కుదరదు అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాలకూ సమానంగా సంక్షేమ ఫలాలు అందాలని సూచించారు.
ఓటుహక్కు వినియోగించుకోకపోవడం వల్లే ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్న నిమ్మగడ్డ రమేష్.. పట్టణాల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు అవుతోందని.. పౌరులు క్రియాశీలకంగా మారి తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలు ఇచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించాలని.. గతంలో బడ్జెట్‌లోని ప్రతి పద్దుపై చట్టసభల్లో చర్చ జరిగేదని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తించి స్థానిక సంస్థలకు రాజ్యాంగపరంగా విధులు, నిధులు ఇవ్వాలన్నారు.
స్థానిక సంస్థలు బలహీనపడితే మిగతా వ్యవస్థలూ బలహీనం అవుతాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నామన్న నిమ్మగడ్డ.. ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో ముందే చూసుకోవాలని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు వస్తుందని.. అధికారులు నిక్కచ్చిగా ఉంటే ఓటర్ల జాబితాలో అక్రమాలే జరగవని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఓట్ల జాబితా ప్రక్రియను ఉపాధ్యాయులే చూసేవారని.. ఇప్పుడు అనుభవం లేనివారికి ఓటు నమోదు బాధ్యతలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దొంగఓట్లపై ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయవచ్చన్న నిమ్మగడ్డ.. పరిశీలించి తొలగిస్తారని.. అందరూ కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఓట్ల జాబితాలో అక్రమాలను 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ' సంస్థ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపవరింగ్ డెమోక్రసీ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నామని.. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరపడం అవసరమని తెలిపారు. మీడియా లేకుంటే సమస్యలనేవి బయట ప్రపంచానికే తెలియవన్న నిమ్మగడ్డ.. మీడియా ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వాలు స్వీకరించాలని సూచించారు. ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటానని ప్రతి ఒక్కరూ అనుకోవాలని అన్నారు.
ఓటు హక్కు వినియోగంపై.. ఆకట్టుకుంటున్న లఘుచిత్రం
మాజీ సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హక్కులు, బాధ్యతలు రెండూ రైలు పట్టాల్లా ఉండాలని తెలిపారు. వెయ్యేళ్ల బానిస సమాజంలో మనం స్వేచ్ఛ కోల్పోయామని.. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చామని గుర్తుచేశారు. పౌరుల చైతన్యమే సమాజ వికాసానికి మూలమన్నారు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే ప్రభుత్వాల అసలైన బాధ్యతని ఎల్వీ (Former Andhra Pradesh chief secretary LV Subramanyam) పేర్కొన్నారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సీఈసీ వి.ఎస్.సంపత్ గురించి చెప్తూ.. సంపత్ నెల్లూరు జిల్లాలో జన్మించారని, రాష్ట్రంలో, కేంద్రంలో అనేక శాఖల్లో పనిచేశారని తెలిపారు. సంపత్ సీఈసీగా ఉన్నప్పుడు 313 కోట్ల రూపాయల విలువైన సామగ్రి సీజ్ చేశారని చెప్పారు. సంపత్ సీఈసీగా ఉన్నప్పుడు గస్తీ బృందాలు పటిష్టంగా పనిచేశాయని, ఆయన ఉన్నప్పుడే ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టారని అన్నారు.