BJP Leaders Fire on MP Vijayasai Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి మహిళలను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో పేర్లు చెప్పాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలంటే.. విపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని.. విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు.
BJP Bhanu Prakash Reddy Fires On Vijayasai Reddy: ఏపీలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని, వీటిని కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. లేనిపక్షంలో విజయసాయిరెడ్డి వెంటనే చెంపలు వేసుకుని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీలో అంతా మాజీ మంత్రి కొడాలి నాని మాదిరిగా కావాలనుకుంటున్నారని అన్నారు.
నాని ఎప్పుడు, ఎలా మాట్లాడతారో తెలియదని, విజయసాయిరెడ్డి కూడా అదే మార్గంలో వెళ్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, సీఎంను మెప్పించడమే వైసీపీ నాయకులకు తెలిసిందని, ఆంధ్రప్రదేశ్‌ను అరాచక, అవినీతి ప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. నేటి డిజిటల్ యుగంలోనూ.. మద్యం అమ్మకాల్లో నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. భూములు, గనులు, ఇసుక ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఈ అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ భావిస్తోందన్నారు.
ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా జగన్‌కు ప్రజలు ఓటు వెయ్యబోరని.. వచ్చే ఎన్నికలలో ఈ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని భానుప్రకాష్‌రెడ్డి జోస్యం చెప్పారు. పోలింగ్ రోజు ప్రజలు కూడా బటన్ నొక్కి జగన్‌ను సాగనంపుతారని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొడితే.. వైసీపీ నాయకులు దారుణంగా కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులకు భయం వేస్తోందన్నారు. ఈ పరిణామాలకు కర్త, కర్మ, క్రియ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండే జగన్ మాత్రమేనని అన్నారు.
CM Ramesh on AP Liquor Scam : మద్యం కుంభకోణంలో సీఎం జగన్, అవినాష్‌రెడ్డి కీలక పాత్ర : సీఎం రమేశ్
Vijayasai Reddy comments on Bhubaneswari: విజయసాయి రెడ్డి మద్యం సేవించి, మతి భ్రమించి మాట్లాడినట్లుగా ఉందని మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ విమర్శించారు. తాను మద్యం సేవించలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపైనే ఉందన్నారు. అధికార మదంతో మహిళ అని కూడా చూడకుండా పురందేశ్వరిని కించపరిచేలా మాట్లాడుతున్నారని.. మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని దిల్లీలో నిర్మితం కానున్న అమృతవనంలో భాగస్వామ్యం అయ్యేలా బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున 900 గ్రామాల నుంచి సేకరించిన మట్టి కలశాలను ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి పంపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. మట్టి కలశాలను దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సీవీ రెడ్డి చారిటీస్ నుంచి శోభాయాత్రగా రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. దేశసేవకు.. దేశ స్వాతంత్య్రానికి జీవితాన్ని అర్పించిన ఎందరో మహనీయుల గౌరవ సూచికంగా అమృతవనం నిర్మాణం అవుతోందని.. పవిత్ర భావనతో రాష్ట్రం నుంచి కలశాలను దిల్లీకి పంపుతున్నట్లు పురందేశ్వరి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు పురందేశ్వరి విముఖత చూపారు.