BJP dharna over diversion of funds by AP Sarpanchs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను మళ్లించి.. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తోందంటూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో 26 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనాచౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజులతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్, బీజేపీ నేతలు, జనసేన నేతలు, సర్పంచులు పాల్గొని..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Purandeshwari fire on YSRCP govt: ఈ పాపం జగన్ ప్రభుత్వానిదే.. ఒంగోలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నేడు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేశారని.. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆగ్రహించారు. ఈ పాపం జగన్ ప్రభుత్వానిదేనని పురందేశ్వరి దుయ్యబట్టారు.
''సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. సర్పంచుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చాం. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపులపై నిరసనలు చేపట్టాం. నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగట్లేదు. సొంత డబ్బులు పెట్టి సర్పంచులు పనులు చేశారు. ఆ పనుల బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. చిన్న గుత్తేదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు రాక చిన్న గుత్తేదారులు కూడా రోడ్డునపడ్డారు. సర్పంచుల ఆత్మహత్యల పాపం..ఈ జగన్‌ది కాదా..?. ఏనాడైనా సర్పంచులపై జగన్ మాట్లాడారా..?. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపైనే జగన్ మాట్లాడుతారు తప్ప సర్పంచుల గురించి మాట్లాడరు. సర్పంచుల వ్యవస్థను అవమానపరుస్తున్నారు. గ్రామాల్లో పనుల కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తున్నారు. సర్పంచ్ వ్యవస్థను ఈ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.''-పురందేశ్వరి, -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు.
BJP on Panchayat Agitations: పంచాయతీల నిధుల స్వాహాపై.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు
Sujana Chaudhary fire on CM Jagan: జగన్ లక్షల కోట్లు దోటుకుంటున్నారు.. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే తప్ప.. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు మేలు చేకూరేలా లేదని.. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇసుక, గనులు, భూములు ఇలా సహజ వనరులను అనేక మాఫియాల ద్వారా దోచుకుంటూ.. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం, సుపరిపాలనను సైతం దూరం చేస్తూ.. వారికి విడుదల చేసిన నిధులను దారి మళ్లించిన ఘనత ఈ దేశంలో మరెవరికీ లేదని.. విశాఖపట్నం జిల్లా ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బీజేపీ మహా నిరసనలో ధ్వజమెత్తారు.
''ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అస్తవ్యస్థంగా పరిపాలన చేసే జగన్ మోహన్ రెడ్డి వంటి నాయకులు వస్తారని.. రాజ్యాంగాన్ని రచించిన డాక్టరు బీఆర్ అంబేడ్కర్ వంటి వారు అప్పట్లో ఊహించి ఉండరు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దారిమళ్లిస్తోందనేది సీఐజీ కూడా పేర్కొంది. కేంద్రం వీటిపై పరిశీలన చేస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తారనే ఆశాభావాన్ని మాలో ఉంది. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను నీరుగార్చడానికి వాలంటీరు వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటీరు వ్యవస్థ వైఎస్సార్సీపీ ప్రైవేటు ఆర్మీగా పనిచేస్తోంది.''-సుజనా చౌదరి, బీజేపీ నేత.
Adinarayana Reddy fire on AP Govt: కేంద్ర నిధులను రాష్ట్రం వాడుకుంటుంది.. పంచాయితీల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరెట్ వద్ద మహా నిరసన చేపట్టారు. అంబేద్కర్ కూడలి నుంచి కడప కలెక్టరెట్ వరకు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. సీఎం డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. పట్టణాల తరహాలోనే పల్లెలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో పంచాయతీలకు 8 వేల 6 వందల కోట్ల రూపాయలు నిధులు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు.
''నిధులను కాజేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. జగన్‌కు జ్ఞానం అపారం. కానీ, బుద్ది మాత్రం వంకర. రాష్ట్ర ప్రజలపైన ముఖ్యమంత్రికి ఏ మాత్రం జాలి, దయ ఉండవు. జగన్ కనికరం లేని కనకరాజు. ఓ చెల్లి దిల్లీ కాంగ్రెస్ చుట్టూ.. మరో చెల్లెలు సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. సర్పంచుల నిధుల మళ్లింపుపై కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశాము.న్యాయం జరిగేవరకూ పోరాడుతాం.''-ఆదినారాయణ రెడ్డి, భాజపా రాష్ర్ట ఉపాధ్యక్షుడు.