Bezawada Boy Won Medals in International Silambam Competition: చూశారా.. కర్రసాముతో ఔరా అనిపిస్తున్న ఈ బాలుడి పేరు వెలుగుల సాత్విక్. అతడి వయసు తొమ్మిదేళ్లు. తండ్రి నాగబాబు ఓ ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుంటే.. తల్లి ఆశాజ్యోతి ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. నిత్యం విజయవాడ ఇందిరాగాంధీ క్రీడా మైదానానికి వ్యాయామం చేసేందుకు వెళ్లే నాగబాబు.. కొందరు చిన్నారులు కర్రసాము నేర్చుకోవడం చూసి.. తన కుమారుడికీ నేర్చించాలనుకున్నారు.
శిలంభం అనే ప్రాచీన యుద్ధకళపై సాత్విక్ కూడా ఆసక్తి చూపడంతో.. ఏడాది క్రితం సత్య శ్రీకాంత్ వద్ద శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. అంతలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రజతం సాధించిన సాత్విక్.. తాజాగా బెంగళూరులో ప్రపంచ శిలంభం పోటీల్లోనూ పాల్గొన్నాడు. స్టిక్ ఫైట్‌లో బంగారు, సింగల్ స్టిక్‌లో వెండి పతకాలు సాధించాడు.
"ఇటీవల పిల్లలంతా శిలంభం ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో విజయవాడ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ ఎంపికయ్యారు. వారిలో సాత్విక్ ఒకరు. పది దేశాల నుంచి.. సుమారు 20 మంది క్రీడాకారులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. వారందరినీ వెనుకకు నెట్టిన సాత్విక్ స్టిక్ ఫైట్‌లో బంగారు, సింగల్ స్టిక్‌లో వెండి పతకం సొంతం చేసుకున్నాడు." - సత్య శ్రీకాంత్ ,శిలంభం శిక్షకుడు
"నేను ఈ కర్రసాము శిక్షణను సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను బెంగళూరు టోర్నమెంట్‌కు ఎంపికయ్యాను. అక్కడ పోటీల్లో పది దేశాల నుంచి సుమారు 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నాకు మొదట భయం వేసింది. అయితే నా కోచ్, తల్లిదండ్రుల ప్రోత్సహంతో పోటీలో పాల్గొని.. స్టిక్ ఫైట్‌లో బంగారు, సింగల్ స్టిక్‌లో వెండి పతకం గెలుచుకున్నాను." - సాత్విక్ , క్రీడాకారుడు
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ముందు ఇతర దేశాల క్రీడాకారులను చూసి కొంత భయం వేసిందని, అయితే కోచ్ సత్య శ్రీకాంత్, తండ్రి నాగబాబు ప్రోత్సాహంతో ధైర్యంగా పోటీల్లో ముందుకెళ్లాలని సాత్విక్ చెబుతున్నాడు. నిరంతరం సాధన చేయటం ద్వారానే పతకాలు సాధించగలిగినట్లు తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో తమ బిడ్డ బంగారు పతకం సాధించటం పట్ల సాత్విక్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమారుడుని ఈ కళలో మరింత రాణించేలా తీర్చిదిద్దుతామని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
"ఇంటర్నేషనల్ పోటీలు అనేసరికి మొదట్లో నేను భయపడ్డాను. పది దేశాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. వారిలో నా కుమారుడు పతకాలు సాధించటం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడి వారంతా ఇండియా.. ఇండియా.. సాత్విక్.. సాత్విక్ అని అన్నప్పుడు ఒక తండ్రిగా నా ఆనందానికి అవధుల్లేవు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరింతమంది పిల్లలను కోచ్ సత్య శ్రీకాంత్ ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తారు." - నాగబాబు, బాలుడి తండ్రి
ఇవీ చదవండి: