Banks inquired CRDA : వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తున్న అప్పుల వినియోగంపై బ్యాంకులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తీసుకున్న 2 వేల500 కోట్ల రూపాయల రుణ వినియోగంపై మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆరా తీసి వెళ్లినట్లు సమాచారం. వడ్డీలు చెల్లించకపోవటంపై ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారని తెలిసింది.
అమరావతిలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్న రుణాల్లో ఇండియన్ బ్యాంకు నుంచి 430 కోట్ల రూపాయలు , పంజాబ్ నేషనల్ బ్యాంకు 16 వందల కోట్ల రూపాయలు, మిగతా మొత్తాన్ని యూనియన్ బ్యాంకు సీఆర్డీఏకు ఇచ్చాయి. రాజధాని ప్రాంతంలోని వివిధ ఆస్తులను తనఖా పెట్టి సీఆర్డీఏ ఈ రుణాలని పొందింది. వాస్తవానికి ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. అయితే రుణ వినియోగం సక్రమంగా జరగకపోవటంతో బ్యాంకుల ఉన్నతాధికారులు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి ఆరా తీసినట్టు తెలుస్తోంది.
మూడు నెలలకోసారి చెల్లించాల్సిన 52 కోట్ల రూపాయల వడ్డీని కూడా సీఆర్డీఏ చెల్లించకపోవటంతో ఆయా బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఉన్నతాధికారులు సీఆర్డీఏ వివరణ కోరినట్టు సమాచారం. తీసుకున్న కారణాల మేరకు రుణాన్ని వినియోగించకపోవటం, వడ్డీ చెల్లింపుల ఆలస్యంపై సదరు బ్యాంకర్లు ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలకు నివేదికలు పంపినట్టు తెలుస్తోంది.
సీఆర్డీఏకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు వసూలు కోసం నేరుగా రావడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికీ రాజధాని విషయంలో లేని అధికారం ఉందని చెబుతూ.. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలంగాణలో భూముల రేట్లు తక్కువ ఉండేవి.. ఇప్పుడు ఏపీలో భూముల ధరలు పడిపోయాయన్నారు. తెలంగాణలో పెరిగాయని అన్నారు.
ఇవీ చదవండి :