Minister Peddireddy Ramachandra Reddy: అడవులు, వాతావరణం మార్పులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటవీ శాఖ ముగింపు సమావేశానికి హాజరైన ఆయన.. ఇతర దేశాలు వాతావరణంలో మార్పుల కోసం.. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అడవులను పెంచుతున్నారని తెలిపారు. మనకు ప్రకృతి సహజ సిద్ధ ఎర్ర చందనం వుందని తెలిపారు. ఎర్రచందనం కోసం అరెస్టైనా పర్వాలేదనే విధంగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని వెల్లడించారు. తిరుపతిలో పట్టా భూమిలోనూ రెడ్ శాండిల్ పెంచుతున్నారని పేర్కొన్నారు. మనకు 33శాతం అడవి ఉండాల్సి ఉండగా.. కేవలం 23శాతం మాత్రమే వుందన్నారు.
మైనింగ్ వ్యవహారాలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్: మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది. 3 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఈసారి 5 వేల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అక్రమాలకు వీల్లేకుండా బరువును బట్టి సెస్ వసూలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మైనింగ్ శాఖకు కేంద్రం నుంచి రెండు అవార్డులు వచ్చాయని తెలిపారు. అక్రమాలు జరక్కుండా సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్‌ను పెట్టామని తెలిపారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు అక్రమాలు జరిగే అవకాశం ఉందని పెద్దిరెడ్డి వెల్లడించారు.
ప్లాస్టిక్ నిషేదంపై: ప్లాస్టిక్ మీద శ్రద్ధ పెట్టి ఫ్లెక్సీలు నిషేధించామని తెలిపారు. ఫారెస్ట్‌లోకి కూడా ప్లాస్టిక్ రాకుండా చాలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చెట్లు నాటడమే కాదు వాటిని బ్రతికించడం కూడా ముఖ్యమని వెల్లడించారు. మైనింగ్‌కు అనుమతి ఇచ్చినప్పుడు అన్ని రూల్స్ పాటించి ఇస్తున్నామన్నారు. ఏనుగుల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని, అవి జనవాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నగర వనాలు ఇక్కడి ప్రజలకు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. లాండ్ సర్వేలో చాలా చోట్ల రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్ అన్నట్టు తయారైందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు మన భూమి అసలు వదులుకోవద్దని సూచించారు. జూపార్క్‌లలో జంతువుల మార్పిడి చేపట్టాలని తెలిపారు. తద్వారా సందర్శకులు పెరుగుతారని.. రెవెన్యూ వస్తుందని వెల్లడించారు.
ఇవీ చదవండి: